అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.

మంగళవారం నాడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని  రవీంద్ర కుమార్ ఆరోపించారు.   ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మరో వైపు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మరో వైపు విశాఖపట్టణంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) బెంచ్ ను ఏర్పాటు చేయాలని రాజ్యసభ జీరో అవర్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కోరారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 323 (ఏ) ప్రకారం ప్రతి రాష్ట్రంలో క్యాట్ ఏర్పాటు చేసే  అవకాశం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర విజభన తర్వాత రాష్ట్రంలో క్యాట్ ఏర్పాటు చేయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రంలో 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో 60 శాతం మంది విశాఖపట్టణంలోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల సౌకర్యం  కోసం విశాఖలో క్యాట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.