గుంటూరు: నేరస్తుడు పాలకుడు అయితే ఆ రాజ్యంలో నేరగాళ్లు ఎలా పేట్రేగిపోతారో ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనే నిదర్శనమని టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసిపి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయని... వారి ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని అన్నారు. 

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ''దళిత శంఖారావం'' నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ అధికారంలో ఉన్నపుడు దళితులను ఏ విధంగా అభివృద్ధి చెందేలా చేయాలి... ఏ విధంగా వారి జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించేవారమని... అందుకోసం ప్రయత్నించి సక్సెస్ కూడా అయ్యామన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది అటుంచితే దళితులపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. 

''గుంటూరు జిల్లా ఆత్మకూరులో వందలాది దళిత కుటుంబాలను గ్రామ బహిష్కారం చేశారు. పొలాలు సాగు చేయనీకుండా లాక్కున్నారు. ఇళ్లల్లో నుంచి తరిమేశారు. అప్పుడే ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిస్తే అడ్డుకుని నా ఇంటి గేటుకు పసుపు తాళ్లు కట్టారు. 1,780 మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులను అరెస్టులు చేశారు, 75 మందిని హౌస్ అరెస్ట్ చేశారు, 37 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. ఆరోజే ఈ ‘పసుపు తాళ్లే’ మీ మెడకు ఉరితాళ్లు కాబోతున్నాయని హెచ్చరించాను. ఆరోజే ఈ పోరాటం ప్రారంభమైంది'' అన్నారు. 

''ఒకరిని అరెస్టు చేస్తే వంద గొంతులు లేస్తాయి. వంద మందిని అరెస్టు చేస్తే వేలాది గొంతులు నిలదీస్తాయి. లక్షలాది మంది ఉద్యమిస్తారని పాలకులు గుర్తుంచుకోవాలి. 15 నెలల్లో 150 దాడులు, 4 హత్యలు, 2 హత్యా ప్రయత్నాలు, 4 గ్యాంగ్ రేపులు, 2 శిరో ముండనాలకు పాల్పడ్డారు. ముదినేపల్లి మండలంలో ఏకంగా ఓ కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అనేక మంది ఇళ్లు కూల్చేశారు. వందలాది మందిని అక్రమ అరెస్టులు చేశారు. దళిత మేధావులపై వేధింపులకు పాల్పడ్డారు. వందలాది పేద దళిత కుటుంబాల భూములు లాక్కున్నారు. అనాగరికంగా వ్యవహరిస్తున్నారు.  ఇదేనా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఇచ్చే విలువ, గౌరవం'' అని వైసీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. 

read more  దళితులకు...చంద్రబాబు విదేశీ విద్య- జగన్ స్వదేశీ శిరోముండనం: నారా లోకేష్

''రాజమండ్రిలో శిరోముండనం ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటే విశాఖలో మరో శిరోముండనం జరిగేదా? ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ యువకుడు వీడియో పెడితే రెండు రోజుల్లో చనిపోయేలా వేధిస్తారా? ఓటేసి గెలిపించినందుకు ఇలాగా పాలించేదని ప్రశ్నిస్తే చంపేస్తారా? గురజాలలో దళిత యువకుడు దోమతోటి విక్రమ్ ను హైదరాబాద్ నుండి పిలిపించి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అతని రాకపోకల సమాచారం ప్రత్యర్థులకిచ్చి హతమార్చేలా చేశారు. తూగో జిల్లాలో దళిత యువకుడ్ని కర్రలతో కొట్టి చంపారు. సీలింగ్ కు వేలాడదీసి ఉరివేసుకున్నట్లు ప్రచారం చేశారు. మాస్కు ధరించలేదని చీరాలలో కిరణ్ అనే యువకుడిని పోలీసులే కొట్టికొట్టి చంపేశారంటే రాష్ట్రంలో బతికేదెలా.? ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఎక్కడైనా మాస్కులు ధరించి కనిపించారా..? మాస్కు లేదని కొట్టి చంపే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది..? మాస్కు లేదని కొట్టి చంపే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు..?'' అని నిలదీశారు. 

''ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఏరోజూ మాస్కు పెట్టుకున్న దాఖలాల్లేవు. కానీ మాస్కు పెట్టుకోలేదన్న కారణంతో చంపేయడం దుర్మార్గం కాదా.? రాజమండ్రిలో 16 ఏళ్ల ఓ దళిత బాలికను 12 మంది నాలుగు రోజులు చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే.. చర్యలు తీసుకోవడం మాని బాధితురాలిపైనే ఒత్తిడి తేవడమే పోలీసు వ్యవస్థ దారుణాలకు నిదర్శనం. ముదినేపల్లి మండలంలో ఓ దళిత కుటుంబాన్ని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించడం, ఉదయగిరిలో అనూష హత్య, ఓ మంత్రి అనుచరుడు మహిళను చంపేసి తెలంగాణలో పడేయడం ప్రభుత్వ వైఫల్యం కాదా.?'' అని మండిపడ్డారు. 

''గతంలో టీడీపీ హయాంలో దాచేపల్లి వద్ద ఒక బాలికపై అత్యాచారం చేస్తే.. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా  నిందితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. 'ఆడబిడ్డలకు రక్షగా ఉందాం'అంటూ విజయవాడలో ఓ ర్యాలీ నిర్వహించి మహిళలపై ఏ చిన్న అకృత్యానికి పాల్పడినా.. అదే చివరి రోజు అనే పరిస్థితి కల్పించాం. కానీ నేడు రోమ్ తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తి మాదిరిగా జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఆనందిస్తూ దళిత వ్యతిరేకిగా మారారు. దళితులపై ఇన్ని అరాచకాలు చేస్తుంటే  జగన్ ఎందుకు నోరు తెరవడం లేదు?'' అని అడిగారు. 

''పడవ ప్రమాదంపై మాట్లాడినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ పై తప్పుడు కేసులు పెట్టి 48 రోజులు జైల్లో పెడతారా? మహాసేన రాజేష్ ఏం చేశాడని అరెస్టు చేశారు.? మాస్కు అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడని ముద్రవేశారు. చివరికి కోర్టు చొరవతో సీబీఐ విచారణకు ఆదేశించారు. కుట్ర కోణం ఉందని సీబీఐ చెప్పింది. దళిత డాక్టర్ అనితా రాణిని అసభ్యంగా ఫోటోలు తీసి వేధించారు. దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. భూములు ఆక్రమించారు. గృహనిర్భందం చేశారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో అరాచకాలు సృష్టిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.? దుర్గిలో లిడ్ క్యాప్ భూముల్ని లాక్కున్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు, అకృత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు.? ఎందుకు నోరు తెరవడం లేదు.?'' అంటూ  చంద్రబాబు విరుచుకుపడ్డారు.