అమరావతి: గోదావరి నదికి భారీగా వరదలు రావడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే పునరావాస చర్యలను చేపట్టాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోరారు.

also read:గోదావరికి పోటెత్తిన వరద: ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు సీఎం ఫోన్

సోమవారం నాడు ఏపీసీఎం వైఎస్ జగన్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు లేఖ రాశారు. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దవళేశ్వరం వద్ద సుమారు 19 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రంలోకి నీరు చేరుతోంది. చంద్రబాబునాయుడు లేఖ యధాతథంగా ఇస్తున్నాం.

గౌ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి.

విషయం: గోదావరి వరదలు-జల దిగ్బంధంలో వందలాది గ్రామాలు- ముంపు ప్రాంత ప్రజల ఇక్కట్లు -నీట మునిగిన వరి, పత్తి ఉద్యాన పంటలు-కరెంటులేక అగచాట్లు-రాకపోకలకు ఇబ్బందులు- పునరావాస శిబిరాల్లో వసతుల లేమి- తక్షణ సహాయ పునరావాస చర్యల గురించి..

గత 3రోజులుగా భారీ వర్షాలు, గోదావరి వరద ఉధృతి, వాగులు-వంకలు పొంగి, ఉభయ గోదావరి జిల్లాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు స్థంభించి, కరెంటు లేక రెండు జిల్లాల ప్రజల అవస్థలు అన్నీఇన్నీ కావు. పంటలు నీటమునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఒకవైపు కరోనాతో అల్లాడుతున్న ప్రజలపై, ఈ వరద ముంపు ఊహించని ఉపద్రవంగా మారింది. 
విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.  కూనవరం,విఆర్ పురం, చింతూరు,యటపాక  మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది గ్రామాలు వరద నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. కుకునూరు, వేలేరుపాడు,బూర్గంపాడు మండలాల్లో పంటలు నీట మునిగాయి. మన్యసీమ, కోనసీమలో లంకగ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.ముమ్మిడివరం, పి గన్నవరం నియోజకవర్గంలో అనేక గ్రామాలు నీటమునిగాయి. దేవీపట్నం మండలంలోనే వేలాది ఇళ్లు నీట మునిగాయి.
తూగో జిల్లా ఐ పోలవరం,రాజోలు,సఖినేటిపల్లి తదితర 65గ్రామాల్లో 1,460హెక్టార్లలో వరిపంట, ఎటపాక, కూనవరం మండలాల పరిధిలో 22గ్రామాల్లో 225హెక్టార్లలో పత్తి, 282హెక్టార్లలో ఉద్యానపంటలు నీట మునిగాయని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. 


యుద్దప్రాతిపదికన స్పందించి రెండు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఎన్ డిఆర్ ఎఫ్, ఎస్ డిఆర్ ఎఫ్ దళాల ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలి. పునరావాస కేంద్రాల్లో అన్నివసతులు ఉండేలా చూడాలి. తాగునీరు, భోజనం, విద్యుత్ వసతులు కల్పించాలి. అంటువ్యాధులు ప్రబలకుండా సరైన వైద్యం అందించాలి, పారిశుద్య చర్యలు చేపట్టాలి. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలను తక్షణమే చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుని బాధితుల్లో భరోసా నింపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ధన్యవాదములతో,
నారా చంద్రబాబు నాయుడు