అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని... వైసిపి నాయకులు అరాచకాలను పాల్పడుతూ గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమయిన పుంగనూరులో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

డిజిపికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ:

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం-మీడియా ప్రతినిధులపై వరుస దాడులు-దళితుల అనుమానాస్పద మరణాలు-పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జర్నలిస్ట్ వెంకట నారాయణపై దాడి- అరాచక శక్తులు జర్నలిస్ట్ ఇంటిపై దాడి చేయడం- భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం గురించి  

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, దారుణమైన స్థితికి చేరాయి. దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్ ను ఆటవిక రాజ్యంగా మార్చారు. బడుగు బలహీన వర్గాల వారిపై గంపగుత్త దాడులే కాదు, విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం, రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాలరాయడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారు.

మీడియాపై వరుస దాడులు చేస్తున్నారు. తుని, నెల్లూరు, చీరాల తదితర ప్రాంతాల్లో జర్నలిస్ట్ లపై దాడులు తెలిసిందే. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు పంచాయితీలో తెలుగు దినపత్రిక జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై పట్టపగలు  దాడి చేయడమే తాజా దృష్టాంతం. ఈ దాడికి పాల్పడింది అధికార పార్టీ వైసిపికి చెందినవారు కాబట్టే వాళ్ల పాత్ర బైటకు రానివ్వకుండా పోలీసులే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవలనే ఇద్దరు దళితుల అనుమానాస్పద మరణం  కూడా ఇదే పుంగనూరు నియోజకవర్గంలో జరిగాయి. దళిత వర్గానికి చెందిన ఎం నారాయణ, ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో క్షీణించిన శాంతి భద్రతలను ఈ దుర్ఘటనలే స్పష్టం చేశాయి. పుంగనూరు నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు పట్టపగలు జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై జరిగిన దాడి కన్నా, మరో సాక్ష్యం అవసరం లేదు. ప్రజాస్వామ్యానికే ఫోర్త్ ఎస్టేట్ లాంటిది మీడియా. జర్నలిస్ట్ లపై ఇటువంటి విచ్చలవిడి దాడులు కొనసాగితే, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యం ఉనికినే కోల్పోతుంది. జర్నలిస్ట్ లపై  దాడులు భారత రాజ్యాంగానికే వ్యతిరేకం, ఆర్టికల్ 19ను ఉల్లంఘించడం, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమే..కాబట్టి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను.

నారా చంద్రబాబు నాయుడు,

శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత.