Asianet News TeluguAsianet News Telugu

జిల్లాల పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం.. రేపటి నుంచి కర్నూలు టూర్, 3 రోజులు అక్కడే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. 

tdp chief chandrababu tour in kurnool district for three days
Author
First Published Nov 15, 2022, 8:22 PM IST

ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాల పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి కర్నూలు జిల్లా పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు అక్కడే పర్యటించనున్నారు. 

బుధవారం మధ్యాహ్నం పత్తికొండకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రికి ఆదోనికి చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం పట్టణంలో రోడ్ షో నిర్వహించి.. అనంతరం ఎమ్మిగనూరుకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి కర్నూలు నగరానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహిస్తారు చంద్రబాబు. 

ఇకపోతే.. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 126 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆయన మాట్లాడారు. పార్టీ కమిటీలు, మెంబర్‌షిప్ వంటి అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. ఎక్కడా గ్రూపులు కట్టరాదని.. అందరినీ కలుపుకుని వెళ్లాలని ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు. వారి పనితీరుపై తర్వాత నివేదిక తెప్పించుకుంటానని చంద్రబాబు తెలిపారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే.. అందుకు తగినట్లుగా నిర్ణయాలు వుంటాయని హెచ్చరించారు.

ALso REad:పులివెందులకూ జగన్ చెడ్డపేరు తెస్తున్నారు.. ఇదే ఆయనకు లాస్ట్ ఛాన్స్ : చంద్రబాబు వ్యాఖ్యలు

నియోజకవర్గాల సమీక్షలో భాగంగా బుధవారం పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండలకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ తీరుతో ఆయనను ఎన్నుకున్న పులివెందులకు కూడా చెడ్డపేరు వస్తోందన్నారు. తన పాలన, విద్వేష రాజకీయాల కారణంగా సొంత నియోజకవర్గానికి కూడా చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ దోషులను కాపాడటం స్థానిక ప్రజలకు నచ్చడం లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు అదే చివరి ఛాన్స్ అవ్వనుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. వైసీపీ పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలకు దగ్గరకావాలని చంద్రబాబు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios