గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై ప్రేమోన్మాది చేతిలో బిటెక్ విద్యార్థిని రమ్య దారుణంగా హత్యకు గురయ్యింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
గుంటూరు: పట్టపగలే నడిరోడ్డుపై హత్యకు గురయిన బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ తో పాటు టిడిపి నాయకులను అరెస్ట్ పై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు సీరియస్ అయ్యారు. పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలపై పోలీసుల దౌర్జన్యమా? అంటూ మండిపడ్డారు. సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవండంలో జగన్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రతాపం చూపించాలని చంద్రబాబు హెచ్చరించారు.
హత్యకు గురైన దళిత విధ్యార్ధిని రమ్య కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన దళిత విధ్యార్దిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ నరేంద్ర లపై అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు. వారిపై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్యగావించబడుతుంటే దిశ యాప్ ఏం చేస్తుంది? సిసి కెమెరాలు ఏమయ్యాయి? అని చంద్రబాబు నిలదీశారు. గుంటూరు నడిబొడ్డునే సిసి కెమేరాలు పనిచేయలేదంటే జగన్ రెడ్డికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమౌతుందని అన్నారు. టిడిపి నాయకులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
read more హత్యకు గురైన రమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత: తోపులాట, నారా లోకేష్ అరెస్టు
నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రేమోన్మాది శశికృష్ణ చేతిలో హతమైన బిటెక్ విద్యార్థిని రమ్య నివాసం వద్ద ఇవాళ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నాయకులు రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి రాగా ఇరు పార్టీల కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది.
ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వెనక్కి పంపించారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రమ్య నివాసంవద్దే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసినప్పటికీ రమ్య నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఈ రోజు మధ్యాహ్నం రమ్య మృతదేహానికి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. పరిస్థితి క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతుండటంతో కుటుంబసభ్యులను ఒప్పించి త్వరగా అంత్యక్రియలను ముగించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే దళిత, ప్రజా, మహిళా సంఘాలు మాత్రం నిందితున్ని తక్షణమే శిక్షించిన తర్వాత రమ్య అంత్యక్రియలు జరపాలంటూ ఆందోళనలకు దిగుతున్నారు.
