హత్యకు గురైన రమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత: తోపులాట, నారా లోకేష్ అరెస్టు
ప్రేమోన్మాది శశికృష్ణ చేతిలో హత్యకు గురైన రమ్య నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు నారా లోకేష్ తదితరులను అరెస్టు చేశారు.
గుంటూరు: ప్రేమోన్మాది శశికృష్ణ చేతిలో హతమైన బిటెక్ విద్యార్థిని రమ్య నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. రమ్య మృతదేహాన్ని జిజిహెచ్ నుంచి నివాసానికి తరలించారు.
ఈ రోజు మధ్యాహ్నం రమ్య మృతదేహానికి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వెనక్కి పంపించారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
రమ్య నివాసానికి చేరుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసినప్పటికీ రమ్య నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
రమ్యను శశికృష్ణ అనే యువకుడు కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. దళిత యువతి రమ్యను హత్య చేసిన ఘటనలో పోలీసులు శశికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. దళిత యువతికి రక్షణ కల్పించలేకపోయింందని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యకర్తలు రమ్య నివాసానికి చేరుకున్నారు.
ఇదిలావుంటే, ప్రేమోన్మాది శశికృష్ణ చేతిలో హత్యకు గురైన గుంటూరు బిటెక్ విద్యార్థిని రమ్య తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులూ కార్యకర్తలూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రమ్య తల్లిదండ్రులను పరామర్శించడానికి హోం మంత్రి మేకతోటి సుచరిత ఆస్పత్రికి వచ్చారు. సుచరిత ముందు తల్లిదండ్రులు బోరున విలపించారు. పది లక్షల రూపాయలు రమ్య తల్లిదండ్రులకు అందించడానికి వచ్చారు. తొలుత వారు డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, అధికారులు నచ్చజెప్పడంతో వారు తీసుకున్నారు. అయితే, శశికృష్ణను ఎన్ కౌంటర్ చేయాలని రమ్య తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
శశికృష్ణను బహిరంగంగా శిక్షించేవరకు జిజిహెచ్ ఆస్పత్రి నుంచి తీసుకుని వెళ్లేది లేదని భీష్మించుకున్నారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేసినప్పుడు, వారిని పట్టుకోనప్పుడు ప్రభుత్వాన్ని నిందించడానికి వీలుంటుందని సుచరిత చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి పది లక్షల రూపాయలు పంపించారని ఆమె చెప్పారు.
తన కూతురిని కత్తితో పొడుస్తుంటే ఎవరూ ఆపలేదని, హత్యాకాండను చూస్తూ మిన్నకుండిపోయారని రమ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.