గుంటూరు: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి  సహా పలువురు టిడిపి నాయకుల అక్రమ అరెస్ట్ లపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వమనడమే టిడిపి నేరమా..? అని ప్రశ్నించారు. ఈ అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 

''ఇళ్లు కట్టి 13నెలలైనా పేదలకు స్వాదీనం చేయకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా..? కట్టిన ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూడటానికి టిడిపి నాయకులు వెళ్లడం నేరమా..? మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని రాత్రి 7.30గం దాకా పోలీస్ స్టేషన్ లో అక్రమ నిర్బంధం చేస్తారా..?'' అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

''రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన టిడిపి నాయకులను వెంటనే విడుదల చేయాలి. టిడిపి ప్రభుత్వం కట్టిన ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలి. హౌసింగ్ లో పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని'' చంద్రబాబు డిమాండ్ చేశారు.

బుధవారం విశాఖపట్నం జిల్లాకు చెందిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టయ్యారు. పెందుర్తి రాతిచెరువు సమీపంలో ఉన్న టిడ్కొ ఇళ్ల నిర్మాణ పనులను సందర్శించేందుకు వెళ్లిన ఆయనను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 

గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ సత్యనారాయణ ఆద్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాగా కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడటంతో బండారు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.