నన్ను, లోకేష్‌ను చంపేస్తామంటున్నారు: దెందులూరు సభలో చంద్రబాబు సంచలనం
తనను ,లోకేష్ ను కూడా చంపేస్తారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు.
ఏలూరు: తనను, లోకేష్ ను కూడా చంపేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్లు తల్చుకొంటే బాబాయిని చంపినట్టుగా తమను చంపుతారని చంద్రబాబు పరోక్షంగా జగన్ పై ఆరోపణలు చేశారు. వాళ్లు తలుచుకుంటే మొద్దుశ్రీనుని మా ఇంటికి పంపించివారమని రాయలసీమలో ఒకరు అంటున్నారని ఇటీవల రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు.
జగన్ కు పోలీసులుంటే తనకు ప్రజలున్నారన్నారు. చివరి అవకాశం తనకు కాదు, ప్రజలకు అని చంద్రబాబు చెప్పారు.ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలన్నారు.మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదని చంద్రబాబు చెప్పారు.తనకేం కొత్త చరిత్ర అవసరం లేదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు ఎందకు చంపారో జగన్ రెడ్డి చెప్పాలన్నారు.సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారన్నారు. అంతేకాదు సాక్షులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.టీడీపీ మీటింగ్ లకు రావొద్దని బెదిరిస్తున్నారన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ధైర్యంగా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు.. పోలవరానికి కేంద్రమే డబ్బులిస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా కూడా ఈ ప్రాజెక్టును నాశనం చేశారన్నారు.
బాబాయిని చంపినంత సులువుగా తనను చంపొచ్చనుకొంటున్నారన్నారు. ఇప్పుడు లోకేష్ ను కూడా లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.ఈ తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు తేల్చి చెప్పారు.దెందులూరు లండన్ బాబు శాశ్వతంగా లండన్ పోతాడని చంద్రబాబు చెప్పారు.కోతలతో విద్యాదీవెనను అమలు చేస్తున్నారని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. రివర్స్ టెండర్ అంటూ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని చంద్రబాబు విమర్శించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదన్నారు.పోలవరం నిర్వాసితులకు ఇంకా పునరావాసం దక్కలేదని చంద్రబాబు చెప్పారు.గోదావరి జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితికి తీసుకువచ్చారని చంద్రబాబు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ. 2.75 లక్షల తలసరి అప్పు ఉందన్నారు.ఏదీ జరిగినా దానికి తానే బాధ్యుడినని వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారన్నారు.