అనారోగ్యంతో బాధపడుతున్న కూతురికి వైద్యం అందించాలని కోరిన తల్లిని పిచ్చాసుపత్రికి తరలించిన కాకినాడ ఘటనపై టిడిపి చీఫ్ చంద్రబాబు స్పందించారు. 

కాకినాడ : అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డకు బ్రతికించుకోవాలని తాపత్రయపడటమే ఆ తల్లి తప్పయ్యింది. కన్న కూతురికి వైద్యం అందించాలని కోరిన ఓ తల్లిని పిచ్చిదానిలా మెంటల్ హాస్పిటల్ కు తరలించిన ఘటన కాకినాడలో వెలుగుచూసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. 

''కాకినాడ కు చెందిన ఆరుద్ర విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తోంది? ఒక బాధిత మహిళ కష్టం తీర్చలేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు తయారయ్యాయి? బిడ్డ వైద్యం కోసం ఆ తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు? మీ ఆరోగ్య శ్రీ ఏమయ్యింది? ఒక మహిళ చేస్తున్న పోరాటానికి స్పందించకపోవడమే వైఎస్ జగన్ మానవీయతా?'' అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

''న్యాయం కోరుతూ ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళ సమస్యను ఏడాది కాలంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ప్రశ్నించిన ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదంటారా? పైగా పిచ్చాసుపత్రికి తరలిస్తారా? అసలు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం ఎవరు? ఆమెను చివరికి ఏం చేయబోతున్నారు? వెంటనే ఆరుద్ర సమస్యను పరిష్కరించాలి. ఆమె కుటుంబానికి తగిన సాయం అందించాలి'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు చంద్రబాబు.

అసలేం జరిగిందంటే : 

కాకినాడ రూరల్ రాయుడుపాలెం గ్రామానికి చెందిన రాజులపూడి ఆరుద్ర కూతురు సాయిలక్ష్మీచంద్ర అనారోగ్యంతో బాధపడుతుంది. తన బిడ్డకు వైద్యసాయం అందించాలని ఆరుద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాకినాడ కలెక్టరేట్ ముందు ఈనెల 7 న కూతురుతో సహా దీక్షకు దిగింది. దీంతో అర్థరాత్రి ఆమెను దీక్షను భగ్నం చేసి హాస్పటల్ కు తరలించారు. 

హాస్పిటల్లోనూ ఆరుద్ర ఆందోళన విరమించకపోవడంతో ఆమె మానసిక స్థితి బాగాలేదంటూ విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందించగా కూతును ఆరోగ్య పరిస్థితి బాలేదని... వైద్యం అందించాలని కోరడంతో వదిలేసారు. అప్పటినుండి వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కూతురికి వైద్యం అందించాలని మళ్ళీ ప్రభుత్వాన్ని కోరుతోంది ఆరుద్ర. దీంతో మానవత్వంతో ఆరుద్ర కూతురికి వైద్యం అందించాలని చంద్రబాబు కూడా ప్రభుత్వాన్ని కోరారు.