గుంటూరు: అధికార వైసిపి నాయకుల అక్రమాలు మరీ ఎక్కువయ్యాయని... వీటిపై ప్రశ్నించిన సామాన్యులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలా ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన ఓ దళిత యువకుడిని అత్యంత దారుణంగా అవమానించారంటూ ట్విట్టర్ వేదికన వెల్లడించారు.

''ఆంధ్ర ప్రదేశ్ లో ఆటవిక పాలన మళ్లీ తిరిగొచ్చింది.  తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో వైసిపి నాయకులు వర ప్రసాద్ అనే వ్యక్తికి గుండు గీయించి అవమానించారు. ఇదంతా జరిగింది పోలీసుల సమక్షంలోనే. దళితుడి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తూ చావబాదడం దారుణం'' అంటూ చంద్రబాబు ఆవేదప వ్యక్తం చేశారు. 

తన ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటూ బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నించడమే అతడు చేసిన ఏకైక తప్పు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? అవినీతికి పాల్పడుతున్న అధికార  పార్టీ నాయకుల చేతిలో పోలీసులు ఎందుకు కీలుబొమ్మల్లా మారారు? ఈ ఘటన మనిషి హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే'' వెల్లడించారు.

 

''తెలుగు దేశం వర ప్రసాద్‌ కు అండగా నిలుస్తుంది. అతడి పట్ల అవమానకరంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించేవరకు పోరాడుతుంది'' అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.