చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నాయకులపై వైసిపి దాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మధుబాబు మరో ముగ్గురిని తీవ్రంగా గాయపర్చడం, వాహనాలను ధ్వంసం చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

''బి.కొత్తకోటలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాల పరామర్శకు వెళ్తున్న నాయకులపై దాడి గర్హనీయం.  జగన్మోహన్ రెడ్డి ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయి. 
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టబద్దమైన పాలన)కు గండికొట్టారు. జగన్ అండతో వైసిపి ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నాయి. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతో నిందితులంతా పేట్రేగిపోతున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. మృతుల కుటుంబాల పరామర్శకు వెళ్లే నాయకులపై కూడా దాడిచేయడం ఫాసిస్ట్ చర్య'' అని మండిపడ్డారు.

''ఏడాదిన్నరగా ఎక్కడ చూసినా అశాంతి, అభద్రతలే తప్ప రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు లేవు. నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు. బడుగు బలహీనవర్గాలపై దాడులు జరగని రోజు అనేదే లేకుండా పోయింది. ప్రతిరోజూ బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిలపై దమనకాండ యధేచ్చగా కొనసాగుతోంది. నేరగాళ్ల అరాచకాలను నియంత్రించే వ్యవస్థే లేకుండా పోయింది. జగన్ సిఎం అయ్యాక పోలీసు వ్యవస్థ నిష్క్రియాపరత్వంగా మారింది'' అని ఆరోపించారు.

read more  చిత్తూరులో టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై వైసీపీ దాడి: ఉద్రిక్తత

''ఈ పాలనలో పేదలు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పెట్టుబడులన్నీ తరలిపోయాయి. కొత్తగా పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడం పెనంమీద పుట్ర అయ్యింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి. పోలీసు వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం కావాలి. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి''అని కోరారు.

''కురబల కోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నాయకులపై దాడికి పాల్పడినవారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. మళ్లీ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 

వైకాపా నేతల దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన లోకేష్ కిషోర్ కుమార్ రెడ్డితో పాటు దాడిలో గాయపడిన టిడిపి నేతలను పరామర్శించారు. ప్రజా సమస్యలపై తెదేపా పోరాటం కొనసాగుతుందని దాడికి పాల్పడిన వారిపై  పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీదేనని లోకేష్ పేర్కొన్నారు.