రాజద్రోహం చట్టం (124 ఏ)పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతితస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
రాజద్రోహం చట్టం (124 ఏ)పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతితస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రాజద్రోహం చట్టం అమలును నిలిపివేస్తూ.. దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సెక్షన్ కింద ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు చేయొద్దని చెప్పడంతో పాటు.. ఇప్పటికే పెట్టిన కేసులపై తదుపరి చర్యలు వద్దని స్పష్టం చేయడం హర్షణీయమని అన్నారు.
నియంతృత్వ పోకడలు అనుసరించే ప్రభుత్వాలు తమ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్నాయని చంద్రబాబు అన్నారు. ఇటువంటి తరుణంలో.. ప్రజా హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..
రాజద్రోహం చట్టంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. ఆ చట్టాన్ని పునఃపరిశీలన చేయాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందుకోసం మరింత సమయం కావాలని విచారణ జరుపుతున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరింది. ఈ క్రమంలోనే బుధవారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసే వరకు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాజద్రోహం చట్టం కింద ఎలాంటి కొత్త కేసులను నమోదు చేయరాదని సీజేఐ ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. రాజద్రోహం సెక్షన్ల కింద కేతాజాగా కేసు నమోదైతే సంబంధిత పక్షాలు కోర్టును ఆశ్రయించవచ్చని, న్యాయస్థానం సమస్యను పరిష్కరిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సమీక్ష జరిగేంత వరకు చట్టంలోని ఈ నిబంధనను ఉపయోగించకపోవడమే సరైనదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు బెయిల్ కోసం న్యాయ స్థానాలను ఆశ్రయించవచ్చని సూచించారు.
ఇక, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా.. తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేమన్నారు. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని చెప్పారు. ఎస్పీ ర్యాంక్ అధికారి ఆమోదిస్తేనే ఈ చట్టం కింద కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని.. పెండింగ్ కేసులను న్యాయపరమైన పోరమ్ ముందు పరిశీలించాలని కూడా మెహతా సుప్రీం ధర్మాసనం ముందు వివరించారు. అయితే ఈ వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యం అవసరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
