Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ‌లో హాట్ టాపిక్‌గా ‘‘సర్వే’’: వారిపై కఠినంగానే వ్యవహరిస్తాను.. చంద్రబాబు హెచ్చరికలు..!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తన వ్యుహాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. పలువురు నేతలకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. 

tdp chief chandrababu naidu warning to party leaders according to Performance
Author
First Published Jun 9, 2022, 10:05 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఇప్పటికే తన వ్యుహాలను అమలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దమనే సంకేతాలు పంపుతుంది. ఇప్పటికే చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లా పర్యటన, మహానాడు‌ సక్సెస్.. టీడీపీలో జోష్ నింపాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు.. క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టత, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పనితీరుపై దృష్టి సారించారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే పార్టీలో గ్రూప్ రాజకీయాలను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలని.. టీడీపీలో పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలన్నారు చంద్రబాబు. తన చుట్టూ ఎవ్వరు తిరిగితే లాభం ఉండదని.. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం  చేయాలని చెప్పారు. నేతల పనితీరును ఎప్పటికప్పుడూ తెలుసుకునే వ్యవస్థ తీసుకోస్తామని కూడా చెప్పారు. 40 శాతం సీట్లు ఈ సారి యువతకు సీట్లు ఇస్తానని ప్రకటించారు. టీడీపీపై అభిమానం ఉన్నవారు పార్టీలో చేరాలని చెప్పారు. పార్టీని నిలబెట్టేది కార్యకర్తలేనని అన్నారు. 

ఈ క్రమంలోనే  చంద్రబాబు కొద్ది రోజులుగా పార్టీ నాయకులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలకు ముందుగానే నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతల పనితీరుపై చంద్రబాబు సర్వే జరిపించారు. ఆ సర్వేలో.. నియోజకవర్గ స్థాయిలో పార్టీల నేతల తీరు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో వారికున్న సంబంధాలు, పార్టీలోని ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఇందుకోసం కొన్ని బృందాలు నియోజకవర్గాల్లో పర్యటించాయి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు..?, కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు ఎవరూ..?, నియోజకవర్గ ఇంచార్జ్‌‌కు ఇతర నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ పటిష్టతకు చేస్తున్న కృషి, నియోజకవర్గంలోని నేతల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయా..?.. వంటి విషయాలపై ఆ బృందాలు సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఇతర మార్గాల ద్వారా సమాచార సేకరణ జరిగినట్టుగా చెబుతున్నారు.   

ఆ సమాచారం ఆధారంగా చంద్రబాబు.. ఇప్పటికే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షలు జరిపారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు.. వార్నింగ్‌లు కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది. పార్టీలో నాయకుల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశిస్తున్నారు. కొంతమంది నాయకులు తమకు కేటాయించిన జిల్లాల్లో పెద్దగా పర్యటించింది లేదని సర్వేలో తెలినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాయకులు నెలలో కనీసం 10 రోజులైనా వారికి కేటాయించిన పార్లమెంట్ నియోజవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించినట్టుగా సమాచారం. మండల స్థాయి వరకు రీచ్ కావాలని.. అక్కడి పార్టీ పరిస్థితులపై పరిశీలించాలని చెబుతున్నట్టుగా తెలిసింది. 

ముఖ్య నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే కింది క్యాడర్‌ మరింత ఉత్సాహంగా పనిచేస్తారని చంద్రబాబు అన్నారు. ఇన్‌చార్జులు, నియోజకవర్గ ముఖ్య నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తుంటే వారికి గట్టిగా చెప్పాలని పార్లమెంట్ నియోజకవర్గ నేతలకు చంద్రబాబు సూచించారు. మూడేళ్ల తర్వాత కూడా ఇంకా కదలకుండా కూర్చుంటామంటే కుదరదని హెచ్చరించారు. వారికి వీలుకాకపోతే పక్కకు తప్పుకోమనండి.. మరొకరు వచ్చి పనిచేస్తారని కూడా చంద్రబాబు గట్టిగానే చెప్పినట్టుగా సమాచారం. 

‘‘గ్రూప్ తగాదాలను చూస్తు ఊరుకోవద్దు. నేతల్లో మార్పు రాకపోతే బయటకు పంపేందుకు వెనకాడేది లేదు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించండి. మీ స్థాయిలో వాటి పరిష్కారం కుదరంటే నాకు చెప్పండి.. వాయిదా వేసుకుంటూ పోవద్దు’’ చంద్రబాబు వారికి సూచించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు మాట్లాడుతూ.. ఒకటి రెండు చోట్ల కఠిన చర్యలు అవసరమని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనితో ఏకీభవించిన చంద్రబాబు.. ఇకపై కూడా సర్వేలు కొనసాగుతాయని.. మార్పు కనిపించకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పినట్టుగా సమాచారం. 

చంద్రబాబు జిల్లాల పర్యటన..
పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా చంద్రబాబు.. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఏడాదిపాటు సుడిగాలి పర్యటన చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 నుంచి మలివిడత జిల్లా పర్యటన చేయనున్నారు. ఏడాదిపాటు సాగే జిల్లాల పర్యటనల్లో భాగంగా 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి వేడుకల్లో భాగంగా ప్రతి జిల్లాలో మినీ మహానాడు నిర్వహించి అందులో చంద్రబాబు పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా నాయుడు రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు చేపట్టనున్నట్టుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios