టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలోని మార్కాపురం గ్రామంలో పత్తిపంటను పరిశీలించారు. వ్యాపారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై తమను మోసం చేశారని రైతులు తనకు తెలియజేశారని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం కర్నూలు జిల్లాకు వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కల్లూరు మండలంలో పత్తిపంట పరిస్ధితిని రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. పాణ్యం నియోజకవర్గంలోని మార్కాపురం గ్రామంలో నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించినట్లు చంద్రబాబు తెలిపారు. వ్యాపారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై తమను మోసం చేశారని రైతులు తనకు తెలియజేశారని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్ధితి వుందని చంద్రబాబు వెల్లడించారు. ఎకరాకు రూ.35 వేలకు పైనే పెట్టుబడులు పెట్టిన రైతన్నకు ఇప్పుడు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు సరఫరాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
Also REad:కర్నూలు పర్యటనకు చంద్రబాబు.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం
కాగా.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం కర్నూలు జిల్లాకు ఆయన వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలోని కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు,. ఆ తర్వాత రోడ్డు మార్గం మీదుగా కోడుమూరుకు చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. నేటి రాత్రికి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు .. రేపు, ఎల్లుండి కూడా కర్నూలు జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇకపోతే.. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 126 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆయన మాట్లాడారు. పార్టీ కమిటీలు, మెంబర్‌షిప్ వంటి అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. ఎక్కడా గ్రూపులు కట్టరాదని.. అందరినీ కలుపుకుని వెళ్లాలని ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు. వారి పనితీరుపై తర్వాత నివేదిక తెప్పించుకుంటానని చంద్రబాబు తెలిపారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే.. అందుకు తగినట్లుగా నిర్ణయాలు వుంటాయని హెచ్చరించారు.
