Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: చంద్రబాబుకు కరోనా.. హోం క్వారంటైన్‌లో మాజీ సీఎం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో వెల్లడిస్తూ.. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు తెలిపారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ కరోనా టెస్టు చేసుకోవాలని కోరారు. తన కుమారుడు నారా లోకేష్ కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. లోకేష్‌కు కరోనా సోకిన తర్వాతి రోజే చంద్రబాబుకూ పాజిటివ్ అని తేలింది.

tdp chief chandrababu naidu tested positive for coronavirus
Author
Amaravathi, First Published Jan 18, 2022, 8:35 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కరోనా(Coronavirus) బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్(Positive) అని తేలిందని వివరించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వెంటనే తాను హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ వెంటనే కరోనా టెస్టు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు నాయుడు కంటే ముందు ఆయన కుమారుడు లోకేష్‌కు కరోనా సోకింది. ఆయన కూడా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ అని వచ్చినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయితే, తనకు కరోనా లక్షణాలు ఏవీ లేవని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలిపారు. ఈ మహమ్మారి నుంచి కోలుకునే వరకు హోం ఐసొలేషన్‌లో ఉండనున్నట్టు వెల్లడించారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారంతా తప్పకుండా వీలైనంత తొందరగా కరోనా టెస్టు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించారు. నారా లోకేష్‌ కరోనా బారిన పడ్డ తర్వాతి రోజే తండ్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఈ వైరస్ పాజిటివ్ అని తేలింది. 

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) నివాసంలోనూ కరోనా కలవరం రేగింది. మంత్రి భార్య శచీదేవి (sachi devi) కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేయించుకోగా నిన్న పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే మిగతా కుటుంబసభ్యులెవ్వరికీ ఈ వైరస్ వ్యాపించపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముందుజాగ్రత్తలో భాగంగా కరోనా నిర్దారణ అయిన భార్యతో పాటు మంత్రి బాలినేని, ఇతర కుటుంబసభ్యులు హోంఐసోలేషన్ లోకి వెళ్లారు.

రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 22వేల మందికి కరోనా టెస్టులు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఆ బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 4,108 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా వెయ్యికి పైగా కేసులు చిత్తూరు, విశాఖపట్నంలో నమోదయ్యాయి. చిత్తూరులో 1004 కేసులు, విశాఖపట్నంలో 1018 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కాగా, 696 మంది పేషెంట్లు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.  కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios