ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతామని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందుకు తెలుగుజాతి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతామని చంద్రబాబు పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని సేవాభావంతో నడిపిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకట నారాయణ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌పై తొలినాళ్లలో వెంకట నారాయణ పుస్తకం రాశారని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ గురించి దేశానికే కాదు.. ప్రపంచానికే తెలియజెప్పారని అన్నారు. 

ఒక నాయకుడు మరో నాయకుడిని ఎలా ప్రభావితం చేస్తారో రజనీకాంత్ చెప్పారని అన్నారు. రజనీకాంత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అన్నారు. ఎన్టీఆర్ ఎక్కడ వుంటే అక్కడ స్పూర్తి వుంటుందని.. భాషతో సంబంధం లేకుండా రజనీ చిత్రాలు ఆదరించారని ఆయన అన్నారు. రజనీకాంత్‌కు జపాన్‌లో వీరాభిమానులు వున్నారని.. మంచి మానవత్వం వున్న వ్యక్తి రజనీకాంత్ అని చంద్రబాబు ప్రశంసించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజనీని ఆహ్వానించామని పేర్కొన్నారు. 

Also Read: చంద్రబాబు ఘనత దేశంలోని నాయకులకు తెలుసు.. అది జరిగితే ఏపీ ఎక్కడికో వెళ్లిపోతుంది: రజనీకాంత్

సినిమా చిత్రీకరణ రద్దు చేసుకుని ఉత్సవాలకు వచ్చారని ప్రశంసించారు. ఎన్టీఆర్ స్పూర్తి .. తెలుగు జాతిలో శాశ్వతంగా వుండాలని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ నటించిన విధంగా భవిష్యత్తులో ఎవరూ చేయలేరని .. శాశ్వతంగా జాతి గుర్తించుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్.. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని , దేశ రాజకీయాల్లో మార్పు తేవాలని సంకల్పించారని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగు జాతి అవమానాలకు గురువుతోందని బాధపడ్డారని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చారని.. తెలుగు చరిత్ర వున్నంత వరకు ప్రజల్లో గుండెల్లో వుండే వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు.