విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై కోదండరాముని విగ్రహం ధ్వంసం చేయడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 4 శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్ధం పుణ్యక్షేత్రంలో విగ్రహాల ధ్వంసం వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమన్నారు.

గత కొన్ని నెలలుగా దేవాలయాలపై వరుస దాడులు, విధ్వంసాలు అనేకం జరుగుతోన్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం శోచనీయమని ఆయన ఎద్దేవా చేశారు. ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు.

అంతర్వేది, బిట్రగుంట దేవాలయాల్లో రథాలకు నిప్పు పెట్టినప్పుడే కఠిన చర్యలు చేపట్టివుంటే ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో మనుషులకే కాదు, దేవాలయాలకు, దేవతా విగ్రహాలకు కూడా భద్రత కొరవడటం దురదృష్టకరం, చేతగాని తనానికి నిదర్శనమని ప్రతిపక్షనేత దుయ్యబట్టారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.