ఇలాంటి దుష్టబుద్దుల వల్లే జగన్మోహన్‌రెడ్డి తాత రాజారెడ్డిని సొంత గ్రామం నుంచి వెలివేస్తే, పులివెందుల చేరి అనేక అకృత్యాలకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. రాజారెడ్డి అడ్డదారిలోనే జగన్మోహన్‌రెడ్డి నడుస్తున్నారని... ఫాక్షనిజం, కుట్రలు, దోపిడీలు, దుష్ప్రచారాలు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబు సెటైర్లు వేశారు.

టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ తల్లి ఆవేదన తనను కలచివేసిందన్నారు.

మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేశారని... తమ తప్పులు కప్పిపెట్టుకోడానికి ఒక కమిటీ వేసి మానసిక రోగిగా చిత్రీకరించారని చంద్రబాబు ఆరోపించారు. మాస్క్ ల గురించి ఆయన అడిగిన తర్వాతనే రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు డాక్టర్లు చనిపోయారని టీడీపీ అధినేత గుర్తుచేశారు.

దళిత డాక్టర్ సుధాకర్ కు చేసిన అన్యాయాన్ని, ఆయనపై దాడిని అందరూ ఖండించాలని, ఆయనపై తప్పుడు కేసులు ఎత్తేయాలని బాబు డిమాండ్ చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి టిడిపిపై ఎదురుదాడి చేస్తున్నారన్న చంద్రబాబు.. ఏది జరిగినా తెలుగుదేశానికి అంటగడుతున్నారని మండిపడ్డారు.

ప్రస్తుత కరోనా సంక్షోభంలో వైద్యులకు ప్రపంచం అంతా నీరాజనాలు పలుకుతుంటే, దేశం అంతా డాక్టర్లపై పూలు జల్లుతున్నారన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మాస్క్ లు అడిగిన డాక్టర్‌ను సస్పెండ్ చేసి, పిచ్చోడి ముద్రవేసి, నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేనని చంద్రబాబు దుయ్యబట్టారు.

ప్రజావేదిక కూల్చడంతో రాష్ట్రంలో విధ్వంసాలు ప్రారంభమయ్యాయని, అమరావతిలో నేనుండే ఇంటిపైకి వరదలు వచ్చేలా చేశారని ఆయన ఆరోపించారు. టిడిపిపై అక్కసుతోనే అమరావతిని నాశనం చేశారని.. పల్నాడు గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించారు, టిడిపి కార్యకర్తలపై దాడులు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

విశాఖ ఎయిర్ పోర్టులో నన్ను అడ్డుకున్నారు, తప్పుడు కేసులు పెట్టి డాక్టర్ కోడెలను బలి తీసుకున్నారు. ఇప్పుడీ దళిత డాక్టర్ సుధాకర్ ను ఈ పరిస్థితికి తెచ్చారన్నారు. బోటు ప్రమాద బాధితులకు న్యాయం చేయమన్న మాజీ ఎంపి హర్షకుమార్ ను 48రోజులు జైలుకు పంపారని, దళిత మహాసేన రాజేష్ పై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ప్రకాశం జిల్లా దుర్ఘటనలో మృతి చెందిన దళితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో వివక్షత చూపారని, చదువు చెప్పే ఉపాధ్యాయులను బ్రాందీ దుకాణాల వద్ద డ్యూటీలు వేసే హీన స్థితికి దిగజారారని ఆరోపించారు.

ఒక సైకోలా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు... నన్ను చూసి ఎవరైనా భయపడాలి, నాకు నచ్చినట్లు వ్యవహరిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్న పెడధోరణితో వ్యవహరిస్తున్నారని బాబు ఆరోపించారు.