అన్ని రాష్ట్రాల సీఎంలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్ల వ్యవహారంపై ఆయన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల లభ్యతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు.. అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్‌పై ఉండాలని జగన్ కోరారు. వ్యాక్సిన్ కోసం  గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎంకు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో వుందని లేఖలో ప్రస్తావించారు. వ్యాక్సిన్ లభ్యతలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లు పరిస్ధితి మారుతోందని జగన్ వ్యాఖ్యానించారు.

Also Read:24 గంటల్లో 11,421 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 17,28,577కి చేరిక

మరోవైపు ఏపీ హెల్త్ సెక్రటరీ ఏకే సింఘాల్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ విషయంలో ఏపీ సహా 9 రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా, వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల బిడ్లు దాఖలు చేయలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో 2 వారాల గడువిస్తామని సింఘాల్ వెల్లడించారు. గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయన్న నమ్మకం లేదని సింఘాల్ అన్నారు. ఏపీలోనే కాదు.. యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని ఆయన తెలిపారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎంలందరికీ జగన్ లేఖలు రాశారని సింఘాల్ వెల్లడించారు.