ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నిబంధనల పేరుతో తమకు అన్యాయం జరిగితే కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లే హక్కును హరించిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

అమరావతి: సొంత డబ్బులతో ప్రభుత్వ పనులు చేపట్టి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఏపీకి చెందిన కొందరు కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకుండా టెండర్ నిబంధనలను మారుస్తూ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జలవనరుల శాఖలో కొన్ని పనుల కోసం ఇచ్చిన టెండర్లలో ఇలా బిల్లుల కోసం కోర్టులకు వెళ్లొద్దని... ప్రభుత్వం బిల్లులు చెల్లించేవరకు వేచిచూడాలనేలా నిబంధన వుండటం చూసి కాంట్రాక్టర్లు షాకయ్యారు. దీనిపై తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్పందిస్తూ వైసిపి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

జగన్ సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిందని టిడిపి అధినేత అన్నారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దు అని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. 

''కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్ లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దు అని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయి. పాలకులకు ఇది సిగ్గుగా అనిపించిందో లేదో కానీ...ప్రభుత్వానికి మాత్రం ఇది సిగ్గుచేటు. 13 కోట్ల టెండర్ పనిలో బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దు అనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోను ఉండి ఉండదు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదు అనే నిబంధన పెట్టే హక్కు అసలు మీకు ఎక్కడ ఉంది? బిల్లుల కోసం కోర్టుకు వెళ్లకూడదు అనే షరుతులు పెట్టే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకు వెళ్లిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి?'' అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు, 

''రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్ వల్ల కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణం అయ్యారు. ప్రభుత్వం కారణంగా ఆయా సంస్థలు దివాళా తీయడం సమాజంపై ఎంతటి ప్రతి కూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాలి'' అని సూచించారు. 

''13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా... ఎయిర్ పోర్ట్ లు, స్టీల్ ప్లాంట్లు నిర్మిస్తుందా... మూడు రాజధానుల కడుతుందా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వైఫల్యం కారణంగా ఏపి స్టేట్ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితి తీవ్ర ఆవేదన కలిగిస్తుంది'' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. 

''ఎవరి బతుకు వారు బతికే పరిస్థితి కూడా లేకుండా చెయ్యడం సంక్షేమమా... కోట్ల మంది జీవితాలను చిన్నాభిన్నం చెయ్యడం అభివృద్ది అవుతుందా? అభివృద్ది వైపు ప్రయాణించే రాష్ట్రాన్ని అంధకారం వైపు నెట్టేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు'' అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.