తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని జోస్యం చెప్పారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తాము సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు.  

సీఎం జగన్ (jagan) రేపో, ఎల్లుండో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని ప్రతిపక్షనేత, టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మరిన్ని రోజులైతే వ్యతిరేకత పెరుగుతుందని జగన్ భయపడుతున్నారని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్ధంగా వుందని.. నెత్తి మీది కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా వున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

మద్యపాన నిషేధం పేరిట నాసికరం బ్రాండ్లు తెచ్చి మహిళల మంగళసూత్రాలు తెంచే జగన్‌కు మహిళా దినోత్సవం (international womens day) నిర్వహించే అర్హత లేదని ఆయన దుయ్యబట్టారు. ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ ఇళ్లు ఇస్తే జగన్‌ రెడ్డి ఆ ఇళ్లపై ఓటీఎస్‌ వసూలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళలకు అమరావతి ఉద్యమం స్ఫూర్తి కావాలని .. మహిళల గౌరవానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీఆర్‌ అని చంద్రబాబు గుర్తు చేశారు.

జగన్‌రెడ్డి అబద్ధాలపై ఓ పుస్తకం వేస్తున్నామన్న ఆయన.. చెత్తమీద పన్ను వేసే ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల జుట్టు మీద కూడా పన్ను వేసేలా ఉన్నారని... మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టడం ద్వారా.. 25 ఏళ్లపాటు మద్య నిషేధం ఉండదని చెప్పేశారని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే... వైసీపీ చికెన్, మటన్‌ షాపుల్లో ఉద్యోగాలిస్తోందని విమర్శించారు. అమ్మ ఒడి.. నాన్న బుడ్డి.. అంటూ అమ్మ ఒడి ద్వారా కొంత ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వారా మరింత లాగేస్తున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు.

వైఎస్ వివేకా హత్య (ys viveka murder case) విషయమై సీఎం జగన్‌ తన సోదరి సునీతకు క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. జగన్‌ క్షమాపణ చెప్పకుంటే ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. చెల్లెలికి న్యాయం చేయలేని వారు.. రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న బాణాన్ని ఊరూ వాడా తిప్పారు... ఇప్పుడు ఆ బాణం గురితప్పి హైదరాబాద్‌లో ఉండిపోయిందని చురకలు వేశారు.