ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ హయాంలో రైతుల పిల్లలు, కూలీల పిల్లలు ఐటీ ఉద్యోగాలు చేస్తే... జగన్ పాలనలో యువతకు మటన్ కోట్లో, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గురువారం ఆదోనీలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ...రాష్ట్రానికి సీఎం జగన్ ఒక శని గ్రహంలా మారారంటూ దుయ్యబట్టారు. నాడు ముద్దులకు మోసపోయి ఓట్లు వేశామని.. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రౌడీయిజం , దోపిడీ, నేరాలు పెరిగిపోయాయని ప్రతిపక్షనేత ఆరోపించారు. 

పోలీసులకు కూడా జీతాలు రావడం లేదని.. మీ పిల్లలూ నష్టపోయారన్న సంగతిని ఆలోచించుకోవాలని చంద్రబాబు సూచించారు. తన పర్యటనలో కొందరు వైసీపీ నేతలు ఓవర్ చేస్తున్నా పోలీసులు చూస్తూ కూర్చొన్నారని, ప్రజలు తిరగబడితే తనకు సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. మద్యం మాఫియాతో జగన్ దోపిడీ చేస్తున్నారని... తయారీ, విక్రయం రెండూ ఆయనే చేస్తున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని.. మన దగ్గర ఇసుక హైదరాబాద్, కర్నాటకల్లో కనిపిస్తోందన్నారు. ఇసుక, మద్యంపై వచ్చే డబ్బులు చాలక నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి రోజూ ప్రజలు తమ భూములు వున్నాయో పోయాయో చూసుకోవాల్సిన పరిస్ధితి తీసుకొచ్చారని.. చుక్కల భూమి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత దుయ్యబట్టారు. 

ALso REad:చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా చివరి ఎన్నిక!

బస్సులే రాని వూళ్లలో వైసీపీ ప్రభుత్వం 120 అడుగుల రోడ్డు వేస్తానంటోందని... రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల ఇళ్లపై రోడ్లు , ఫ్లైఓవర్లు వేయలేమా అని చంద్రబాబు ప్రశ్నించారు. వాల్మీకి, కురబ, వడ్డెర, కమ్మరి, కుమ్మరి సహా అన్ని కులాలను తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో రైతుల పిల్లలు, కూలీల పిల్లలు ఐటీ ఉద్యోగాలు చేస్తే... జగన్ పాలనలో యువతకు మటన్ కోట్లో, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చేశానని.. మరి జగన్ ఎక్కడ చదువుకున్నాడని ఆయన ప్రశ్నించారు.