తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు, వెంకటగిరిలో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు.  ఓట్లు అడిగే అర్హత వైసీపీ లేదని..  డబ్బు తీసుకుని ఓట్లేస్తే హక్కులు కోల్పోతారని ప్రజలకు తెలిపారు.

బెదిరించే వాలంటీర్లను ఎదిరించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ గెలిస్తే అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లేనని ఆయన హెచ్చరించారు.  

Also Read:తిరుపతి బైపోల్స్‌పై రెఫరెండానికి వైసీపీ సై: బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ఇదీ...

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని.. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని చంద్రబాబు చెప్పారు. అప్పుడు ఢిల్లీ వెళ్లి పోరాటం చేయొచ్చని ఆయన సూచించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా గతంలో తాము చేసిన అభివృద్ధే కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందని.. కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని టీడీపీ చీఫ్ ఆరోపించారు. టీడీపీ, వైసీపీ పాలనపై చర్చకు ధైర్యముందా? అని చంద్రబాబు సవాల్‌ విసిరారు.