మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. కొన్ని చోట్ల ప్రాణాలు పణంగా పెట్టి మరీ పార్టీకి అండగా నిలిచారని ఆయన తెలిపారు.

ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని .. వైసీపీ అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడామని చంద్రబాబు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తే రాబోయే రోజుల్లో విజయం టీడీపీదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.  

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్ర‌జాతీర్పుని గౌర‌విస్తున్నామననారు. ఎన్నిక‌ల‌ కోసం రాత్రనక పగలనక శ్ర‌మించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు ఆయన అభినంద‌న‌లు తెలిపారు.

ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అరాచ‌కాన్ని, జ‌గ‌న్‌రెడ్డి అధికార‌మదాన్ని ఎదిరించి నిలిచి, గెలిచిన‌వారికి, పోరాడి ఓడిన‌ వారికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నిక‌లే జ‌ర‌ప‌కూడ‌ద‌నుకున్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అప్ర‌జాస్వామిక వైఖ‌రిని ప్ర‌జ‌ల ముందు ఉంచడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. 

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే చంపేస్తామ‌ని వైసీపీ నేత‌లు బెదిరించినా, నామినేష‌న్లు వేసిన‌ కొందరిని చంపేసినా.. టీడీపీ సైనికులు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారని ప్రశంసించారు.

వైసీపీకి ఓట్లు వేయ‌కుంటే ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టి జ‌రిపిన ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసి నిరాశ చెందొద్దని లోకేశ్ భరోసానిచ్చారు. బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్షంగా... ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై తెలుగుదేశం త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తుందని స్పష్టం చేశారు.