Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ వేదికన పోరాటం... 18రోజులూ ఈ 6 అంశాలపైనే: టిడిపి ఎంపీలతో చంద్రబాబు

టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆన్ లైన్ లో శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. 

TDP Chief Chandrababu Naidu meeting with TDP MPs
Author
Guntur, First Published Sep 10, 2020, 9:11 PM IST

గుంటూరు: పార్లమెంటు సమావేశాలు జరిగే 18రోజుల్లో 6 అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలని టిడిపి ఎంపిలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రతి రోజూ ఒక అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. వైసిపి దుర్మార్గ పాలనను, ప్రజావ్యతిరేక విధానాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఆదేశించారు. 

టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆన్ లైన్ లో శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... టిడిపికి తక్కువ మంది సభ్యులున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా పోరాడుతోందనేది ప్రజల్లో చర్చ జరుగుతోందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. 

పార్లమెంట్ లో ప్రస్తావించాలని తమ ఎంపీలకు చంద్రబాబు సూచించిన ఆరు అంశాలివే: 

1) రాష్ట్రంలో ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను దెబ్బతీసేలా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం మల్లికార్జున స్వామి, కాణిపాకం వినాయకుడి ఆలయం, శ్రీకాళహస్తి దేవాలయం, విజయవాడ దుర్గమ్మ గుడి, అన్నవరం, సింహాచలం అప్పన్న గుడి, అంతర్వేది దేవస్థానం...అన్ని పుణ్యక్షేత్రాలలో అరాచకాలు చేస్తున్నారు, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు, ఉద్రిక్తతలు పెంచుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో నరసింహస్వామి రథానికి నిప్పు, నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పు, సింహాచలం భూముల్లో ఇసుక తవ్వకాలు, మాన్సాస్ ట్రస్ట్ కు తూట్లు పొడవడం, టిటిడి భూములు అమ్మడానికి ప్రయత్నం, బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం, రాష్ట్రంలో మత మార్పిళ్ల గురించి కేంద్రం దృష్టికి తేవాలి. వైసిపి దుర్మార్గాలను ఎండగట్టాలి. ఇన్ని దుర్ఘటనలు వరుసగా గొలుసుకట్టుగా జరుగుతున్నా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నేరగాళ్లు ఇష్టారాజ్యంగా బరితెగిస్తున్నారనేది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టిడిపి హయాంలో దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల పవిత్రత కాపాడాం, ఆస్తులు పరిరక్షించాం, భక్తుల నమ్మకాలను నిలబెట్టాం. ఉమ్మడి ఏపిలో తాడేపల్లిగూడెం, మెదక్ లో ప్రార్ధనా మందిరాల అద్దాలు పగులగొట్టడం వంటి స్వల్ప సంఘటనలు జరిగినప్పుడు కూడా హుటాహుటిన ఆయా ప్రాంతాలను సందర్శించి దోషులను కఠినంగా శిక్షించిన విషయం గుర్తు చేశారు. 


2) వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బిసిలు, మైనారిటీలపై దాడులు జరగని రోజులేదు. 2జిల్లాలలో 2నెలల్లో ఇద్దరు దళిత యువకుల శిరోముండనం, గురజాలలో దళిత యువకుడి హత్య,  పుంగనూరులో సీఎంపై వీడియో పెట్టిన దళిత యువకుడి అనుమానాస్పద మృతి, ప్రకాశం జిల్లాలో మాస్క్ ధరించలేదని దళిత యువకుడిని కొట్టడంతో  ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులో దళిత ఆడబిడ్డల  గ్యాంగ్ రేప్ లు, విశాఖలో, చిత్తూరులో దళిత వైద్యులపై అమానుషాలు, తూర్పుగోదావరి, కడప, అనంతపురం, గుంటూరులో దళితుల ఇళ్ల ధ్వంసం, గ్రామ బహిష్కారాలు, గుంటూరు జిల్లాలో గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపడం, కర్నూలులో గిరిజన మహిళ గ్యాంగ్ రేప్, బిసిలపై అక్రమ కేసులు, టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లు, రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై పార్లమెంటు సమావేశాల్లో ధ్వజమెత్తాలి. 

తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్ శిరోముండనంపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఆదేశాలు ఇచ్చినా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని నిలదీయాలి.  ‘‘ఏపిలో దళితులపై వైసిపి దమనకాండ’’ గురించి రాజ్యాంగ పెద్దలకు, కేంద్ర మంత్రులకు, ఎస్సీ కమిషన్ కు, మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆలయాలపై దాడులు జరుగుతున్నా, దళితులపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచిన పాపాన పోలేదు. ఎస్సీ,ఎస్టీలపై దాడులు, ఆలయాలపై దాడులు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతగాని తనమా..? లేక అరాచకశక్తులను ప్రోత్సాహించడమా..? అధికారం అండతోనే అరాచకశక్తులు ఏపిలో పేట్రేగిపోతున్నాయనేది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలి. 

రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడం, ప్రశ్నించే గొంతును నొక్కడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, న్యాయస్థానాలు అనేకమార్లు తప్పుపట్టినా వైసిపి  నాయకుల్లో మార్పు లేకపోవడం గురించి ప్రస్తావించాలి. ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ వంటి మీడియాపైనే వైసిపి దాడి, జర్నలిస్ట్ లపై తప్పుడు కేసులు, హత్యాయత్నాలు, బెదిరింపుల గురించి కేంద్రం దృష్టికి తేవాలి.

read more   రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: బీజేపీకి జైకొట్టిన జగన్

3)  కరోనా నియంత్రణలో వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ఉభయ సభల్లో ప్రస్తావించాలి. రాష్ట్రాన్ని స్మశానంగా చేశారు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. శారీరకంగా, మానసికంగా,ఆర్ధికంగా చితికి పోయారు. రోజుకు 10వేల కేసులు, 100మంది చనిపోవడం, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ లలో వైఫల్యం గురించి ఎండగట్టాలి. కరోనా లాక్ డౌన్ తర్వాత ఏపికి కేంద్రం రూ 8వేల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైద్య సేవల్లో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ 50లక్షలు, మృతుల అంత్యక్రియలకు రూ 15వేలు, క్వారంటైన్ కేంద్రాలనుంచి డిశ్చార్జ్ అయిన రోగులకు ఇచ్చే రూ 2వేల నగదు ఇవ్వకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునేలా కేంద్రాన్ని కోరాలి.

 4) రాజధాని రైతుల త్యాగాలను గుర్తించే కేంద్రం అప్పట్లో కేపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపులు ఇచ్చింది. ప్రధానిగా నరేంద్రమోది చేసిన తొలి శంకుస్థాపన అమరావతి. రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చింది, నిర్మాణానికి సహకరిస్తామని చెప్పింది. రాజధాని ఎంపికకు కమిటి వేసిన కేంద్రానికి ఇప్పుడు అధికారం లేదనడం అసమంజసం. సర్వే మ్యాప్ లో కూడా రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించింది. రాజధాని అంశం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, కాంకరెంట్ లిస్ట్ లోకి రానప్పుడు, పార్లమెంటుకే దీనిపై అధికారం ఉంటుంది. ఆర్టికల్ 248ప్రకారం దీనిపై జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఏపిలో రాజధానిని 3ముక్కలు చేస్తే, రేపు మరో రాష్ట్రంలో రాజధానిని నాలుగైదు ముక్కలు చేయాల్సి వచ్చే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది, ఇది కందిరీగల తుట్టిని కదిలించడమే అనేది గుర్తుంచుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిపై వైసిపి ఆడుతున్న 3ముక్కలాటను ఎండగట్టాలి. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మార్చితే రాష్ట్ర ప్రయోజనాల మాటేమిటి..? విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు(పిపిఏ) వివిధ కంపెనీల పెట్టుబడుల ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్నట్లే, ఇక్కడ రైతులతో ఒప్పందంపై కూడా కేంద్రమే జోక్యం చేసుకుని, రాష్ట్రానికి వాటిల్లే నష్టాన్ని నివారించాలి. లేకపోతే భవిష్యత్తులో రైతులెవరూ ప్రభుత్వానికి భూములు ఇవ్వరు. 

5) గ్రామాల్లో చేసిన పనులకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ప్రాతిపదికన బిల్లులు చెల్లించకుండా నరేగా స్ఫూర్తిని కాలరాయడం, పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వేధించడం, గత 15నెలల్లో నరేగా నిధుల దుర్వినియోగం, ఇళ్ల స్థలాలకు 10-15అడుగుల లోతైన పల్లపు భూములు సేకరించి, లెవలింగ్ పేరుతో వేలాది కోట్ల నరేగా నిధుల స్వాహా గురించి ఫిర్యాదు చేయాలి. దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రికి టిడిపి ఎంపిల బృందం వినతి అందజేసింది. ఈ సమావేశాల్లో మళ్లీ ప్రస్తావించి పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే చెల్లించేలా ఒత్తిడి తేవాలి. కేంద్రం విడుదల చేసిన రూ1,845కోట్లను నెలరోజుల్లో చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయక పోవడాన్ని కేంద్రం దృష్టికి తేవాలి.  నరేగా చట్ట స్ఫూర్తికి వైసిపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే కేంద్రం చూసీ చూడకుండా పోవడం సరైంది కాదు. 

6) రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం, ఆరోగ్య సంక్షోభం, 14వ, 15వ ఆర్ధిక సంఘం నిధుల మళ్లింపు, 15నెలల్లో రూ లక్షా 3వేల కోట్లు అప్పులు తేవడం, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చడం, తెచ్చిన అప్పులతో ఆస్తుల కల్పన-సంపద సృష్టి లేకపోవడం, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం గురించి ప్రస్తావించాలి. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయడానికి, ప్రజా వ్యతిరేక చర్యలపై కోర్టులలో వాదనలకు,  వాలంటీర్ల జీతాలకు, వేల కోట్లు దుబారా చేయడాన్ని నిలదీయాలని   చంద్రబాబు కోరారు.
 
ప్రతి రోజూ ఒక అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, వైసిపి దుర్మార్గ పాలనను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని చంద్రబాబు తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకులు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు,కేశినేని నాని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios