Asianet News TeluguAsianet News Telugu

బాలినేని వ్యవహారం... జోక్యం చేసుకోండి: గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

వైసీపీ సీనియర్ నేత, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్టిక్కర్‌తో ఉన్న కారులో కోట్లాది రూపాయలను తమిళనాడు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 

tdp chief chandrababu naidu letter to ap governor over balineni srinivasa reddy issue
Author
Amaravathi, First Published Jul 18, 2020, 3:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వైసీపీ సీనియర్ నేత, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్టిక్కర్‌తో ఉన్న కారులో కోట్లాది రూపాయలను తమిళనాడు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. 

గౌ శ్రీ బిస్వభూషణ్ హరిచందన్ గారికి,

విషయం: వేధింపులు మరియు చట్టవిరుద్ధమైన అరెస్టులు - భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 యొక్క ఉల్లంఘన - భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం మరియు వ్యక్తి స్వాతంత్ర్యాన్ని అణిచివేయడం - సోషల్ మీడియా పోస్టుల కోసం క్రిమినల్ సెక్షన్లను ఫైలింగ్ చేయడం – పోలీసు విభాగంలో కొందరితో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు - ప్రాథమిక హక్కుల పునరుద్దరణ మరియు పరిరక్షణ కోసం మనవి చేయడం గురించి...

వైయస్ఆర్సిపి 2019 లో అధికారం చేపట్టినప్పటి నుండి, రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన అరెస్టులు,  ప్రజల అక్రమ నిర్బంధాలు పెరిగి పోయాయి.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించివేస్తోంది.

పోలీసులలో కొందరితో కుమ్మక్కై  అధికార పార్టీ సామాన్య ప్రజలను టార్గెట్  చేస్తోంది, తమను వ్యతిరేకించేవారిని ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుంటోంది. స్వల్ప విమర్శలపై కూడా, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పోలీసులు అత్యంత అమానవీయ, అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఉదాహరణకు, కారులో తరలిస్తున్న రూ 5.27 కోట్లు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుల వద్ద తమిళనాడు పోలీసులు పట్టుకున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, నాయుడుపాలెం గ్రామంలోని వడ్డెల సందీప్ కుమార్ మరియు తొట్టెంపూడి చంద్రశేఖర్ లను 2020 జూలై 16 న అరెస్టు చేశారు. ఇదే వార్తలు, తమిళనాడు అంతటా తమిళ మీడియాలో ప్రసారం అయ్యాయి, ప్రచురించబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ నుండి భారీ మొత్తంలో నగదును అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులపై సమగ్ర విచారణ చేయడం, వారిపై కఠినమైన చర్యలు తీసుకోడానికి బదులుగా,  2020 జూలై 16 న మధ్యాహ్నం 1 గంటలకు సందీప్, చంద్రశేఖర్ లను పోలీసులు అరెస్టు చేశారు.  

ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఒంగోలు గ్రామీణ పోలీసులు, ఆ తర్వాత వారిని ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్ కు, 3స్టేషన్లు తిప్పుతూ దారుణంగా కొట్టడమే కాకుండా భౌతికంగా హింసించారు.

ఇటువంటి భౌతిక హింస, పోలీసులతో దారుణంగా కొట్టించడం వంటి దుశ్చర్యలకు  నాగరిక సమాజంలో, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానం లేదు.  సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19 ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించే చర్యలే... భారత రాజ్యాంగం గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్న వ్యాఖ్యలు, ‘‘ మన రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం కాదు, అదొక జీవన నౌక(లైఫ్ వెహికల్), దాని ఆత్మ ప్రతినిత్యం సజీవం’’ అని అంబేద్కర్ చెప్పిన సూక్తిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.

ప్రస్తుతం మనరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో, బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నరాజ్యాంగ 'ఆత్మ' ప్రత్యక్ష, పరోక్ష దాడికి గురైంది. ఈ రోజు మన రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ చెప్పిన 'జీవన నౌక(లైఫ్ వెహికల్)' తప్పుడు బాటలో నడుస్తోంది.

ఈ నేపథ్యంలో మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ మరియు పునరుద్దరణలో భాగంగా, సందీప్, చంద్రశేఖర్ లకు చట్ట ప్రకారం సత్వర న్యాయం అందించేలా మీ గురుతర జోక్యం తక్షణ అవసరం. ఈ అంశంలో మీ గురుతర జోక్యం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, సమాజంలోని వ్యవస్థల విలువలపై  యువతరంలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

ధన్యవాదాలతో,
నారా చంద్రబాబు నాయుడు
శాసన సభ ప్రధాన ప్రతిపక్షనేత
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
 

Follow Us:
Download App:
  • android
  • ios