పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపపై ప్రత్యేక దృష్టి పెట్టిన  ప్రతిపక్షనేత శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. స్వలాభం కోసం వచ్చిన కొంత మంది నాయకులు వారి పనులు పూర్తిచేసుకుని పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి నష్టం లేదన్నారు. ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని... వాటన్నింటిని సమర్ధవంతంగా త్రిప్పికొట్టిందని ఆయన గుర్తుచేశారు.

పాత నీరుపోయి కొత్తనీరు రావడం తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి వున్న ఆనవాయితీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయారాం గయారాంతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని... అటువంటి వారు భవిష్యత్తులో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు దుయ్యబట్టారు.

ప్రాణాలను సైతం లెక్కచేయక పార్టీకోసం పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం సొంతమన్నారు.  సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేవాడు, కష్టాలలో ధీటుగా పోరాడే వాడు నిజమైన నాయకుడని బాబు స్పష్టం చేశారు. 

అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం చేసిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయని... అలాగే వైసీపీ చేసిన అవినీతి కుంభకోణాలు ఇళ్ల స్థలాల రూపంలో ప్రజల ముందే ఉందన్నారు.

వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తే హత్యలు, హత్యాయత్నాలు, అనుమానస్పద మరణాలు పెరిగిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. గండికోట పరిహారంలో అవినీతి బయటపెట్టినందుకు గురుప్రతాప్ రెడ్డిని దారుణంగా హత్య చేశారని... ఇళ్ల స్థలాలలో అక్రమాలను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్యను హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నందుకే విజయవాడలో తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరాంపై హత్యాప్రయత్నం చేశారని ప్రతిపక్షనేత విమర్శించారు. పోలీసు కేసులకు కూడా భయపడకుండా ధైర్యంగా పనిచేస్తూ, అనునిత్యంగా కార్యకర్తలకు బి.టెక్ రవి అండగా ఉంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆయన నాయకత్వంలో కార్యకర్తలందరూ స్థానిక ఎన్నికలలో టిడిపి బలపరిచిన అభ్యర్ధుల గెలపుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పే భాధ్యత కార్యకర్తలదేనని  చంద్రబాబు వారికి దిశానిర్ధేశం చేశారు.

 

"