టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తనకు బీజేపీతో సెట్ కావడం లేదని మీడియా సమావేశంలో చెప్పిన కాసేపటికే చంద్రబాబును పవన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పవన్‌ను పరామర్శించేందుకే వచ్చానని చంద్రబాబు చెప్పారు. 

పవన్‌తో తన కలయిక ముందుగా అనుకున్నది కాదని... విమానాశ్రయం నుంచి వస్తూ పవన్ హోటల్‌లో వున్నారని తెలిసి నోవాటెల్‌కు వచ్చినట్లు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విశాఖలో జరిగిన ఘటనలపై సంఘీభావాన్ని తెలియజేయడానికి పవన్‌ని కలిసినట్లు ఆయన తెలిపారు. విశాఖలో పవన్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధ, ఆవేదన కలిగించాయని జనసేనాని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన నాటి నుంచి హోటల్‌కు వెళ్లేవరకు పవన్‌ను వేధించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోటాపోటీ సమావేశాలు వున్నప్పుడు పోలీసులు ప్లాన్ చేసుకోవాలని ఆయన హితవు పలికారు. వాళ్లపై వాళ్లే దాడులు చేసుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై పవన్‌ను నిలబెట్టి వేధించారని ఆయన ఫైర్ అయ్యారు. తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. మీడియాకు కూడా స్వేచ్ఛ లేదన్నారు. రాజకీయ పార్టీల నేతలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఏదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రశ్నించే వాళ్లని వ్యక్తిగతంగా వేధిస్తున్నారని.... వైసీపీ లాంటి నీచమైన దారుణమైన పార్టీని నేనెక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు. ఏపీలో రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.