తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయడంతో పాటు అభ్యర్ధులను బంధించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. 

తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు (tirupati town bank election) వివాదంగా మారాయి. కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పాల్గొనకుండా పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టు సీజేకు ఫిర్యాదు చేశారు. పోటీదారులు కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని , నిర్బంధాలపై ప్రశ్నిస్తే పోలీసుల నుంచి సమాధానం రాలేదని సీజే దృష్టికి తీసుకొచ్చారు. 

మరోవైపు కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో అక్రమాలపై కలెక్టర్‌కు లేఖ రాశారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . నకిలీ ఐడీ కార్డులతో వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. దొంగ ఓట్లతో జరిగిన పోలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పోలీసులతో కలిసి వైసీపీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిందని .. వైసీపీ నేతలు అభ్యర్ధులపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. టీడీపీ బలపరిచిన అభ్యర్ధులను బయటకు లాగేసి ఇష్టారాజ్యంగా ఎన్నికలు జరిపిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

Also REad:కుప్పంలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. గ్రామస్థాయి నాయకులే టార్గెట్.. ఉలిక్కిపడుతున్న టీడీపీ..

మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు బయటపడ్డాయని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా అంటూ లోకేశ్ మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారు తప్పించి నాయకుడు అనరంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు వేయించిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.