మద్యాన్ని నియంత్రణ చేయాల్సిన పోలీసులే ఇప్పుడు లిక్కర్ అమ్మే విషయంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.

విజయవాడ ధర్నా చౌక్‌లో ఇసుక కొరతపై 12 గంటలు దీక్ష చేస్తున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వ్యవహారంలో జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇసుక కొరతను సృష్టించి.. వైసీపీ నేతలు మాత్రం హైదరాబాద్, బెంగళూరు కి అక్రమంగా తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సిమెంట్ కంపెనీలను సైతం వైసీపీ నేతలు డబ్బు కోసం బెదిరిస్తున్నారని టీడీపీ చీఫ్ మండిపడ్డారు.

ఏ ప్రభుత్వ హయాంలోనైనా సిమెంట్ ధర ఒకే నెలలో 110 రూపాయలు పెరిగిన దాఖలాలు లేవన్నారు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితం ఇసుకపైనే ఆధారపడి వుందని చంద్రబాబు తెలిపారు. రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్న చందంగా భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని బాబు ధ్వజమెత్తారు.

వరదలు, వర్షాలు వచ్చినప్పుడు గోదావరి, కృష్ణా నదుల్లో ఇసుకను తీస్తారని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రాగానే జగన్ అండ్ కో దోపిడికి పక్కా ప్రణాళిక రూపొందించారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వీళ్లు ఇక్కడితో ఆగరని.. చివరికి మీ ఆస్తులన్నీ జగన్ తన పేరిట రాసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని బాబు ఆరోపించారు.

ఇసుక సమస్యపై ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు రోడ్ల మీదకు వచ్చినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు. టీడీపీకి చెందిన ఇద్దరిని వైసీపీలోకి చేర్చుకుని తనపై విమర్శలు చేయిస్తున్నారని.. అలాంటి కుట్రలు, కుతంత్రాలు తన వద్ద జరగవని ఆయన హెచ్చరించారు.

ఒక నాయకుడు పోతే వందమంది నేతల్ని తయారు చేస్తానని బాబు స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికులు కాలం తీరి చనిపోయారని ఒక మంత్రి వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి మనిషి విలువ, మనుషుల ప్రాణాల విలువ తెలియదన్నారు.

14 సంవత్సరాలు సీఎంగా.. 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా పనిచేశానని తనకు ఇక అధికారం అక్కర్లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఒకప్పుడు ప్రధాని వాజ్‌పేయ్ తన కోసం వెయిట్ చేశారని, అబ్ధుల్ కలాం రాష్ట్రపతి కావాలని పట్టుబట్టానని ఆయన గుర్తుచేశారు.

గతంలో దొంగ లెక్కలు రాసుకుని జగన్ అడ్డంగా దొరికిపోయాడని.. మళ్లీ ఇప్పుడు అదే చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపేందుకు గాను అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశానని బాబు గుర్తుచేశారు.