తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆ పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై చర్చించి జగన్ సర్కార్ పై పోరాటానికి కార్యాచరణ రూపొందించారు.
అమరావతి: వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి సిద్దమయ్యింది ప్రతిపక్ష తెలుగుదేశం. సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలపై చర్చించి జగన్ సర్కార్ పై పోరాటానికి కార్యాచరణ రూపొందించారు.
వచ్చే శనివారం అంటే ఆగస్ట్ 28వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా టిడిని శ్రేణులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని చంద్రబాబు పార్టీ నాయకులకు ఆదేశించారు.
''ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో రూ.413 కోట్లు డిపాజిట్ చేశామని చెబుతున్నా అవి ఇంకా కాంట్రాక్టర్లకు అందలేదు. కేంద్రం రూ.1,991 కోట్లు నరేగా బకాయిలను విడుదల చేసినా వాటిని ఇవ్వకుండా దారిమళ్లించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని నిర్ణయించారు.
''దళితురాలైన రమ్య హత్య కేసు విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్రానికి రానుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున అత్యాచారాలు, హత్యలు, అట్రాసిటీ చట్టం దుర్వినియోగంపై నివేదిక ఇవ్వాలి'' అని సమావేశంలో తీర్మానించారు.
''అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు మొత్తం నగదు ఇచ్చేలా చూడాలి. అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయకుండా చూడాలి'' అని నిర్ణయించారు.
read more ఏపీ రాజధాని వివాదం... హైకోర్టు విచారణ నవంబర్ 26కు వాయిదా
''దశలవారీ మద్యనిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మాట తప్పారు. నాసిరకం మద్యంతో పాటు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని సమావేశంలో నిర్ణయించారు.
''కోవిడ్ నియంత్రణలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. ఇతర రాష్ట్రాలు బాధితులకు ప్యాకేజీ ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. కేంద్ర నిధులు, వ్యాక్సిన్ తోనే మమ అనిపించారు. కరోనాలోనూ పన్నులు, ధరలు పెంచి వేలకోట్లు భారాలు ప్రజలపై మోపారు. ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన దానికన్నా ప్రజలపై మోపిన భారాలు రెట్టింపుగా ఉన్నవి. తెచ్చిన రూ.2 లక్షల కోట్ల అప్పు ఏమి చేశారు? అవినీతి, దుబారా వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది'' అని ఆరోపించారు.
''ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, సాయం అందడం లేదు. జనాభా ప్రాతిపదికన వీరి సంక్షేమానికి నిధులు కేటాయించాలి. జగన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించివేస్తున్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని సమావేశంలో నిర్ణయించారు.
''తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జగన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందారు. జగన్ రెడ్డి మోసాలను రెండేళ్లలోనే ప్రజలు గ్రహించారు. నీలి మీడియా అబద్ధాల ప్రచారం నుంచి ప్రజలు బయటపడుతున్నారు., సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు'' అని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, పయ్యావుల కేశవ్, టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, బోండా ఉమా మహేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాం, బీసీ జనార్థన్ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
