Asianet News TeluguAsianet News Telugu

ఇక వైసిపితో క్షేత్రస్థాయి పోరాటం... సిద్దం కండి..: టిడిపి సీనియర్లతో చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్దం కావాలని టిడిపి సీనియర్లకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు. 

TDP Chief Chandrababu Meeting With Party Senior Leaders akp
Author
Amaravati, First Published Jul 26, 2021, 3:21 PM IST

అమరావతి:  వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే: 

1. రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని అరికట్టాలి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పన్నులు తగ్గించుకోవాలని సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది.

2. గోదావరి వరద ముంపు, వర్షాల వల్ల ఏజెన్సీల్లోని ఆదివాసీలు, ప్రజలు తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయారు. పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం చెందింది. బాధితులందరికీ వెంటనే పరిహారం చెల్లించాలి. పునరావాసం కల్పించాలని డిమాండ్ చేయడమైనది.

3. గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల సబ్సిడీ ఇవ్వాలి. ఇళ్ల పట్టాలు ఇచ్చి మహిళల్ని అప్పులపాలు చేసే విధంగా ప్రభుత్వం వారిపై ఒత్తిడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది. టిడ్కో గృహాల్ని వెంటనే లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.

4. నదీ జలాల విషయంలో జగన్ ప్రభుత్వం రాయలసీమకు చేస్తున్న ద్రోహాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. రాయలసీమకు చేస్తున్న ద్రోహంపై కర్నూలులో పార్టీ రాయలసీమ, నెల్లూరు జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. ఇలాంటి సమావేశాలు, ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.

5. తెలుగువారి త్యాగాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించేందుకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గతంలో వారు డిమాండ్ చేసినట్లు నేడు వైసీసీ ఎంపీలు విశాఖ ఉక్కు, విభజన చట్టం హక్కుల కోసం రాజీనామాలకు సిద్ధపడతారా? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.

6. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం చేసిన మోసంపై తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులను అభినందించారు. ఉద్యోగాలివ్వాలంటూ రోడ్డెక్కిన యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది. 28.07.2021 నాటికి రీ-నోటిఫికేషన్ కోసం ఇచ్చిన గడువు లోగా కొత్త నోటిఫికేషన్ డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని తీర్మానించడమైనది. 

read more  డిజిపి సవాంగ్ పై ఇంటెలిజెన్స్ నిఘా... భారీ మూల్యం తప్పదు: బుద్దా హెచ్చరిక

7. ప్రతిపక్షంలో ఉండగా వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య సీబీఐ విచారణ అవసరం అన్న జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక అసలు సీబీఐ దర్యాప్తే అవసరం లేదన్నారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సుపారీ ఇచ్చినట్లు వాచ్ మన్ రంగయ్య చెప్పడంతో జగన్ అండ్ కో గుండెల్లో వణుకు మొదలైంది. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తిని హత్య చేసేందుకు రూ.8 కోట్ల సుపారీ ఇచ్చేంత అవసరం ఎవరికి ఉందో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇన్ని నెలలైనా ఎందుకు తెలుసుకోలేదు.? పరిటాల రవి హత్యలో సాక్షుల్ని హత్య చేశారు. వివేకానంద రెడ్డి కేసులో ఉన్నవారు కొందరు ప్రాణాలు కోల్పోయారు. రంగయ్యకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీబీఐపై ఉన్నది. రంగయ్యకు ఏమైనా జరిగితే జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

8. ఎన్నికలకు ముందు మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకుని వేల కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారు. ఇప్పుడు మద్య నిషేధం మాట పక్కన పెట్టి బలవంతంగా మద్యం తాగిస్తున్నారు. తాగుబోతుల్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. 15 సంవత్సరాల పాటు మద్యం ఆదాయాన్ని చూపించి రూ.25వేల కోట్లు అప్పులు తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధం హామీని.. నిషా మత్తుకు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేసింది. హామీ ప్రకారం మద్య నిషేధం చేయాలని డిమాండ్ చేసింది.

9. రాష్ట్రంలో అస్తవ్యస్థంగా ఉన్న రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా నిధులు కేటాయించి, రోడ్లకు మరమ్మతులు చేసి రోడ్లకు పూర్వవైభవం కల్పించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది.

10. ప్రజా రాజధాని అమరావతి పరిధిలో జగన్ ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజా వేధిక కూల్చివేత, ఐకానిక్ బ్రిడ్జి బేస్ కూల్చివేత, రోడ్ల ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గంగా పేర్కొన్నారు. వైసీపీ దొంగలు రోడ్లను తవ్వి.. గ్రావెల్ తరలింస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది.? 

11. ఆరుగాలం శ్రమించే రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. రబీ సీజనుకు సంబంధించి రూ.వేల కోట్ల బకాయిలున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పక్షం రోజులైనప్పటికీ.. పాత బకాయిలు చెల్లించకపోవడం రైతుల్ని వేధించడమే. ఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితుల్ని ప్రభుత్వం సృష్టిస్తోంది. పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీడీపీ హయాంలో మొక్క జొన్నకు రూ.1800 గిట్టుబాటు ధర ఉండగా.. ప్రస్తుతం రూ.1000కి పడిపోయింది. ధరలు లేకపోవడంతో పంటలను రోడ్లపై పడేసే పరిస్థితి కల్పించారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

12. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి.. అభివృద్ధికి పునాదులు వేస్తే.. నేడు ఓటు వేయలేదని, తమ సామాజిక వర్గం కాదని, చివరికి వైసీపీ నేతలకు జే ట్యాక్స్ కట్టలేదని సంక్షేమ పథకాలు దూరం చేస్తున్నారు. రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు రద్దు చేస్తున్నారు. బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్,  కింజరాపు అచ్చెన్నాయుడు,  వర్ల రామయ్య,  నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, పర్చూరి అశోక్ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  బండారు సత్యనారాయణమూర్తి,  నిమ్మల రామానాయుడు, కాలవ శ్రీనివాసులు,  బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్,  కొమ్మారెడ్డి పట్టాభిరాం,  మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios