గుంటూరు: సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఇటీవలే అరెస్టయిన  డెయిరీ చైర్మన్, టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మంగళవారం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించారు. కొద్దిరోజులక్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు వాకబు చేశారు. 

వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు భయపడవద్దని... యావత్ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సంగం డెయిరీని కాపాడుకునేందుకు నరేంద్ర నేతృత్వంలో పాల ఉత్పత్తిదారులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

read more జైలు నుంచి విడుదలైన ధూళిపాళ్ల నరేంద్ర.. నెల రోజులు బెజవాడకే పరిమితం

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత ధూళిపాళ్లతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా విడుదలయ్యారు. నెల రోజుల పాటు విజయవాడలోనే వుండాలని...విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని నరేంద్రకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏసీబీ విచారణకు సహకరించాలని కూడా సూచించింది. ధూళిపాళ్ల విచారణకు 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. 

సంగం డెయిరీ కేసులో దూళిపాళ్ల నరేంద్రతో పాటు గోపాలకృష్ణన్ అరెస్టయిన విషయం తెలిసిందే. సంగం డెయిరీ కేసులో ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను ఏప్రిల్ 23వ తేదీన అరెస్టు చేసారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 

కాగా, జైలులో వున్న సమయంలో నరేంద్రకు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. అయితే గత బుధవారం కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో నరేంద్రను తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు. వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు నరేంద్రకు విజ్ఞప్తి చేశారు.