అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ట్రావెల్స్ లో గతంలో పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డిల ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు.

శనివారం నాడు కొందరు లారీ యజమానులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని ఆరోపించారు. తమకు నష్టం కల్గించారని వారు ఆరోపించారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని జేసీ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. 

లారీ ఇంజన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలను సీజ్ అయ్యేందుకు కారణమయ్యారని ప్రభాకర్ రెడ్డిపై లారీ యజమానులు ఆరోపించారు. దీని వెనుక అధికార పార్టీ హస్తం ఉందని జేసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

 ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించిన 10 వాహనాలను జేసీ ఇప్పటికే విక్రయించారు. దీంతో దివాకర్‌ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన లారీ ఓనర్లకు తీవ్ర నష్టం ఏర్పడటంతో జేసీ మోసం చేశారంటూ లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.

జేసీ ఇంటి ముందు ధర్నా చేస్తున్న సమయంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. జేసీ ఇంటి ముందు ధర్నాకు దిగిన లారీ ఓనర్లపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.జేసీ ప్రభాకర్ రెడ్డిపై 420,467,468, ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.