గుంటూరు: ప్రస్తుతం ప్రపంచం కరోనా ముందు –కరోనా తర్వాత అనే పరిస్థితిలో ఉందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పేర్కోన్నారు. కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటే భవిష్యత్తులో మనందరం ఉంటామని... లేకుంటే చరిత్రలో కలిసిపోతామని ప్రజలు ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. కరోనాను ఎదుర్కోవడానికి సంబంధించి కేంద్రానికి సూచనలు చేస్తున్నామన్నారు. 

రెండు రోజుల పాటు కొనసాగిన టిడిపి మహానాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ''ఎన్టీఆర్ జయంతి తెలుగు ప్రజలకు చిరస్మరణీయ రోజు. రెండు రోజుల మహానాడులో 22 తీర్మానాలను ఆమోదించాం. వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్ధిక భరోసా కల్పించడమే టీడీపీ సిద్ధాంతం. బలహీన వర్గాల కోసం పోరాడేందుకు టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది'' అని అన్నారు. 

''బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పార్టీ నాయకులు నిరంతరం పని చేయాలి. భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయాల్సిన బాద్యత మనపై ఉంది. బాద్యతలు ఇద్దాం.. అవకాశాలు కల్పిద్దాం'' అని అన్నారు. 

read more  ఆ మద్యం బ్రాండ్లంటే జగన్ కు చాలా ఇష్టం...అందుకోసమే ప్రభుత్వం ప్రమోట్: చంద్రబాబు

''38 సంవత్సరాల సుధీర్ఘ అనుభవం కలిగి ఉన్నాం. ఐదేల్లు శ్రమించి ఆర్ధిక వ్యవస్థను మనం గాడిన పెట్టాం. వీళ్లు ఏడాదిలోనే ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం గౌరవించకుండా నాశనం చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే మీడియాను బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాలను కాపాడుకుందాం. ప్రాణసమానులైన కార్యకర్తలను కాపాడుకోవడం నా బాధ్యత. ఈ డిజిటల్ మహానాడు నిర్వహణకు కారణమైన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు'' అంటూ చంద్రబాబు ప్రసంగాన్ని ముగించారు.