సిఐడి రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించండి..: ఏసిబి కోర్టులో చంద్రబాబు పిటిషన్
తన అరెస్ట్ అక్రమమని... సిఐడి రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విజయవాడ ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలుచేసారు.

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విజయవాడ ఏసిబి కోర్టులో హాజరుపర్చారు. టిడిపి అధికారంలో వుండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు సిఐడి అధికారులు. ఈ అవినీతి కేసులో చంద్రబాబును ఏ1 గా పేర్కొంటూ సిఐడి రిమాండ్ రిపోర్ట్ ను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ నేపథ్యంతో వైసిపి ప్రభుత్వమే తనపై తప్పుడు కేసులు పెట్టించిందని ఆరోపిస్తూ సిఐడి రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలంటూ చంద్రబాబు ఏసిపి కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
తనపై సిఐడి అధికారులు ఐపిసి 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్ విత్, 13(1)(సి)(డి)సెక్షన్ల కింద కేసులు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై ఈ కేసులు పెట్టారని.. సిఐడి ఆరోపణల్లో నిజాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. కాబట్టి సిఐడి రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని చంద్రబాబు ఏసిబి కోర్టును కోరారు.
Read More 24 గంటల్లోపే చంద్రబాబును కోర్టులో హాజరుపరిచాం.. సీఐడీ తరఫున ఏఏజీ వాదనలు
స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో చర్చించే నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.2015-16 బడ్జెట్ లోనూ ఈ కార్పోరేషన్ ఏర్పాటు గురించి పొందుపర్చామని... దీనికి అసెంబ్లీ ఆమోదం కూడా లభించిందన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే ఈ స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. కాబట్టి తాను పిటిషన్ లో పేర్కొన్న అంశాలను పరిశీలించి సిఐడి రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని చంద్రబాబు కోరారు.
ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన తన వాదనలు కూడా వినాలని చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తిని కోరారు. అందుకు ఏసీబీ న్యాయమూర్తి అనుమతించి చంద్రబాబు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని... మోపిన అభియోగాలన్నీ నిరాధారమని అన్నారు.రాజకీయ లబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు అని అన్నారు. శనివారం ఉదయం 5.40 గంటలకు సీఐడీ తనకు నోటీసులు ఇచ్చిందని.. అయితే ఈరోజు ఉదయం 5.40కు రిమాండ్ రిపోర్టు ఇచ్చారని చెప్పారు.ఇలా అరెస్ట్ చేసిన 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలనే నిబంధనను పాటించలేదని చెప్పారు. సీఐడీ అధికారుల తీరును న్యాయమూర్తికి వివరించారు.