గుంటూరు: కరోనా విజృంభణ వేళ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముందునుండి కరోనాను తేలికగా తీసుకోవడం వల్లే ఇంతదాకా వచ్చిందని... ఇప్పుడు ఏం చేయడానికి లేకపోవడంతో వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని చంద్రబాబు సూచించారు. 

''ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ  ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతోంది. అలాగే కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలి'' అని ట్విట్టర్ ద్వారా తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. 
 

''కరోనాను మొదటి నుంచీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. తీరా తీవ్రత పెరిగాక చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి. అధైర్య పడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం వద్దు'' అని సూచించారు. 

 

''కరోనా విపత్తులో తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలచి విధులు నిర్వర్తిస్తోన్న వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. అలాంటి వారి త్యాగాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలి. వారికి తగిన రక్షణ, వారి కుటుంబాలకు భరోసాను ప్రభుత్వం కల్పించాలి'' అని కోరారు.


 
''అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల మంచి కోసమే పనిచేస్తుంది అని చెప్పడానికి కరోనా వేళ పార్టీ శ్రేణులు చేసిన కార్యక్రమాలే నిదర్శనం. ఎంతో బాధ్యతతో, నిబద్ధతతో ఈ కార్యక్రమాలను నిర్వర్తించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు పేరు పేరునా అభినందనలు'' అంటూ వీడియోలను జతచేస్తూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.