సోమవారం ఎన్టీఆర్ 25వ వర్దంతి వేడుకలు మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ప్రతి తెలుగువాడు ఘన నివాళులు అర్పించే రోజు ఇదన్నారు. ప్రతి తెలుగువాడు గర్వపడే వ్యక్తిత్వం ఎన్‌టిఆర్ ది అన్నారు. ఆ 3 అక్షరాల్లో ఒక స్ఫూర్తి, మార్గదర్శకం, పౌరుషం ఉందన్నారు చంద్రబాబు. 

''ఎన్టీఆర్ కు ‘‘భారత రత్న’’ ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. దీనిపై అనేక లేఖలు రాశాం, మహానాడులో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాం. కాబట్టి వెంటనే కేంద్రం స్పందించి ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటించాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

''ఎన్టీఆర్ అసాధారణ వ్యక్తిత్వంతో చరిత్ర సృష్టించారు. ఆయనతో పోటిపడగల వ్యక్తి చరిత్రలో లేరు, భవిష్యత్తులో రారు. సినిమా నటుడిగా ఆయనకు ఆయనే సాటి. 292సినిమాల్లో వివిధ పాత్రల్లో జీవించారు. శ్రీకృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యుడు. పురాణ పురుషులుగానే కాదు, అనేక చారిత్రక పాత్రల్లో నిరుపేదగా, రిక్షావాడిగా అనేక సాంఘిక పాత్రల్లో  జీవించాడు'' అని గుర్తుచేశారు.

''రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. రూ2కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పేదలకు పక్కాఇళ్ల ద్వారా నివాస భద్రత, జనతా వస్త్రాలతో అందరికీ దుస్తులు వంటి సంక్షేమ పథకాలు ఎన్నో తెచ్చారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేశాడు. అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. బచావత్ అవార్డు నీటి కేటాయింపులు సద్వినియోగం చేశారు'' అని తెలిపారు.

read more  మా ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి

''ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చారు. మహిళా విశ్వవిద్యాలయం, మహిళలకు రిజర్వేషన్లు ఎన్టీఆర్ ఘనతే.. ఎన్టీఆర్ విధానాలనే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టింది. మాండలిక విధానం, సింగిల్ విండో విధానం ద్వారా పాలనా సౌలభ్యం కల్పించారు.  27% రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి బిసిలకు రాజ్యాధికారంలో భాగం కల్పించారు. తర్వాత ఆ రిజర్వేషన్లనే ఇంకా పెంచి అమలు చేశాం. సామాజిక న్యాయానికి ఎన్టీఆర్ పాటుబడ్డారు. ఆయన ఆశయాలనే తర్వాత టిడిపి ప్రభుత్వం కొనసాగించింది'' అన్నారు. 

''సంపద సృష్టించడం, దానిని పేదలకు పంచడం ద్వారా పేదరికం నిర్మూలన, ఆర్ధిక అసమానతల తొలగింపునకు కృషి చేశాం. చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారు. ఎన్టీఆర్ అంటే స్ఫూర్తి, భవిష్యత్ కు మార్గదర్శకం. ఆయన చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు'' అని పేర్కొన్నారు.

''ప్రజాసేవకే రాజకీయం తప్ప, అణిచివేత కోసం కాదు. రౌడీయిజం, తప్పుడు కేసులు, వేధింపులతో అణగదొక్కడమే పనిగా వైసిపి పెట్టుకుంది. వైసిపి వాళ్లు గాలికి వచ్చారు, గాలికే కొట్టుకుపోతారు. భయం అంటే తెలియని పార్టీ తెలుగుదేశం. దాడులు, దౌర్జన్యాలకు భయపడేవాళ్లు కాదు టిడిపి కార్యకర్తలు. ఈ బాధలు ఎన్టీఆర్ కు కూడా తప్పలేదు. ఎక్కడో రాజీవ్ గాంధీని హత్యచేస్తే హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఆస్తులపై దాడులు చేశారు, రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారు. అయినా ఎన్టీఆర్ భయం అనేది లేకుండా రాష్ట్రవ్యాప్త పర్యటన చేశారు, ట్యాంక్ బండ్ పై నిరాహార దీక్ష చేశారు. దాడులు, దౌర్జన్యాలను నిరసించారు. ఏనాడూ, ఎవరికీ భయపడలేదు ఎన్టీఆర్. భయం అనేది ఆయన జీవితంలో లేదు. ఎన్టీఆర్ స్ఫూర్తి మనందరిలో ఉండాలి. ఆయన బాటలో నడవడమే ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి'' అని అన్నారు.

''నీతికి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం. ప్రజా సేవ కోసమే తప్ప, డబ్బుల కోసం రాజకీయం చేసేవాళ్లు కారు టిడిపి కార్యకర్తలు. మత సామరస్యం టిడిపి సిద్దాంతం. ఏ మతంపై దాడికి పాల్పడినా టిడిపి సహించదు. దేవాలయాలపై దాడులు చేసిన వాళ్లను వదిలేసి, దాడులకు వ్యతిరేకంగా పోరాడేవాళ్లపై కేసులు పెట్టడం హేయం. దేవాలయాలపై దాడులు జరిగితే తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాడింది. అలాగే ఏ మతంపై దాడి జరిగినా తెలుగుదేశం పార్టీ వారి తరపున పోరాడటానికి ముందుంటుంది. దేవాలయాల దాడులపై పోరాడిన వాళ్లపై కేసులు పెడుతున్నారు. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతోంది? మత విశ్వాసాలపై దాడి జరిగితే పోరాడకూడదా? సిసిటీవి సాక్ష్యాలు ఉంటే ఎందుకు భయటపెట్టడం లేదని అడుగుతున్నా?'' అంటూ నిలదీశారు.

''టిడిపి కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. టిడిపిని అంతం చేయాలని ఎందరో కలలు గన్నారు. అలాంటి కలలు కంటే అవన్నీ పగటి కలలే. ఎవరికీ టిడిపి పునాదులు కదిలించే శక్తి లేదు. ఎవరైనా ఆ పునాదులు కదల్చాలనుకుంటే పార్టీ ఇంకా 20-30 సంత్సరాలు బలంగా తయారవుతుందని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని పెట్టిన ముహూర్త బలం, సంకల్పబలం అలాంటిది.  సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్దాంతమే టిడిపి కార్యకర్తలకు మార్గదర్శకం. ఏ వర్గానికి, ఎక్కడ అన్యాయం జరిగినా టిడిపి అండగా ఉంటుంది. బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దాడులకు పాల్పడితే సహించేది లేదు. ప్రతి టిడిపి కార్యకర్త మరో ఎన్టీఆర్ కావాలి. కొండవీటి సింహంగా, బొబ్బిలిపులిగా పోరాడాలి. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త అంకితం కావాలి'' అని సూచించారు.

read more దానికి ఆద్యుడు ఆయనే : ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి...

''ప్రజల్లో రోజురోజుకూ ఎన్టీఆర్ పై ప్రేమ పెరుగుతుందే తప్ప తరిగేది కాదు. సమాజం పట్ల, ప్రజల పట్ల ఎన్టీఆర్ కు ఉన్న చిత్తశుద్ది, అంకితభావానికి అదే నిదర్శనం. కాంగ్రెసేతర పార్టీలు అన్నింటినీ ఒకేతాటిపైకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. అటు బిజెపిని, ఇటు కమ్యూనిస్టులను కలిపి దేశం కోసం ఏకతాటిపై నడిపించారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు వెనుక కీలక భూమిక ఎన్టీఆర్ దే'' అని చంద్రబాబు గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంలో ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, శాసనమండలి సభ్యులు టిడి జనార్ధన్, అశోక్ బాబు, జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం, అధికార ప్రతినిధులు సయ్యద్ రఫీ, గంజి చిరంజీవి ,  దివ్యవాణీ తదితరులు పాల్గొన్నారు.