ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు వర్థంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన భార్య లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ గురించి.. అదే విధంగా ఏపీలో జగన్ పాలన గురించి ప్రస్తావించారు.

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆమె అన్నారు. ఆయన సుపరిపాలన అందరికీ ఆదర్శం కావాలన్నారు. ప్రస్తుతం ఏపీలో మంచి పాలన జరుగుతోందని.. జగన్ పాలన రామరాజ్యంలా సాగుతోందన్నారు.

తమ ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడని.. మనవడు జన్మించాడని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.  ఆయన ఆశయ స్పూర్తితో తన భర్త ఆశీస్సులు ఆ బిడ్డ పై ఉండాలని ఆకాంక్షించారు.

ఏపీలో విగ్రహాల ధ్వంసంపై లక్ష్మీపార్వతి స్పందించారు. గత 25 ఏళ్ల నుంచి ఏ దగా కోరు రాజకీయాలు నడిచాయో.. ఇప్పుడు కూడా అవే నడుస్తున్నాయన్నారు. దొంగలు వెంటనే దొరికిపోతున్నారని.. ఎవరూ బుకాయించడానికి లేదని.. మభ్యపెట్టడానికి లేదన్నారు. 

అంత మంచి పాలన అందిస్తున్న జగన్‌కు వ్యతిరేకంగా నీచమైన కుట్ర జరుగుతోందని.. కానీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని.. ఆ కుట్రలన్నీ గాలికి పోతాయన్నారు. ప్రజాభిమానమే ఏపీ సీఎంకు శ్రీరామ రక్ష అన్నారు