జగన్‌కు చంద్రబాబు కౌంటర్.. ‘ఆయన వదిలిన బాణం ఇప్పడు రివర్స్‌లో తిరుగుతున్నది’
ప్రతిపక్షాలు కుటుంబాలను చీలుస్తాయని, రాజకీయాలు చేస్తాయని, రానున్న రోజుల్లో కుటుంబాలను చీల్చే కార్యక్రమాలు పెరుగుతాయని సీఎం జగన్ ఈ రోజు కాకినాడలో అన్నారు. ఈ వ్యాఖ్యలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
YS Sharmila: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఈ రోజు కాకినాడ సభలో మాట్లాడుతూ.. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అవి కుటుంబాలను చీలుస్తాయని, రాజకీయాలు చేస్తాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో కుటుంబాలను మరింత చీల్చే కార్యక్రమాలు జరుగుతాయని, కుట్రలు, కుతంత్రాలు పెరుగుతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకుని తమపై పడ్డాడేంటీ? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న వదిలిన బాణం అని చెబుతూ ఆమె రాష్ట్రమంతా తిరిగిందని, ఇప్పుడు రివర్స్‌లో తిరుగుతున్నదని వివరించారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని ఆయనే చూసుకోవాలని, ఆయన చూసుకోకుంటే దానితో తమకేమిటీ? సంబంధం అని నిలదీశారు. ఏదో ఒకరకంగా ఇతరులపై బురద జల్లేసి బతకటం ఒక రాజకీయమా? అంటూ ఫైర్ అయ్యారు. పింఛన్ల పెంపు కోసం పెట్టిన కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం సబబేనా? అంటూ ప్రశ్నించారు.
వైఎస్ జగన్ చెల్లికి, తల్లికి ఆయనకు దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. దీంతో కాంగ్రెస్ తెలంగాణలో వలే వేగంగా పుంజుకునే అవకాశాలు లేకపోలేవు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీపైనే పెద్ద దెబ్బ కొట్టే ముప్పు ఉన్నది. ఇది పరోక్షంగా టీడీపీ, జనసేన కూటమికి కలిసి వచ్చే అంశం. అంటే.. చెల్లి నిర్ణయాలతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఓటుకు నోటు కేసు కొనసాగిస్తా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్కే
మరికొన్ని గంటల్లో వైఎస్ షర్మిల తనను కలవడానికి వస్తున్న తరుణంలో ఆయన కాకినాడలో పింఛన్ల పెంపు కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ఆయన కాకినాడ నుంచి తిరిగి వెళ్లగా.. షర్మిల ఆయనను కలిసి 25 నిమిషాలపాటు భేటీ అయ్యారు.