మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  20రోజులుగా చికిత్స పొందుతున్న మాణిక్యాలరావును కాపాడుకోలేక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్దికి, అర్చకుల సంక్షేమానికి పాటుబడ్డారు. శాసన సభ్యునిగా తాడేపల్లి గూడెం అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం కట్టుబడి పని చేశారని’’ చంద్రబాబు కొనియాడారు.

మాణిక్యాల రావు కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ  నారా లోకేశ్ కూడా మాణిక్యాల రావు మరణం పట్ల సంతాపం తెలిపారు.

ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన మంత్రిగా ఉన్నత శిఖరాలకు ఎదిగారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారని లోకేశ్ అన్నారు. మాణిక్యాల రావు మృతిపట్ల ఆయన సంతాపం తెలిపారు. 

పాజిటివ్‌గా తేలడంతో గత నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో మాణిక్యాల రావు చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన మాణిక్యాల రావు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 

2014లో బీజేపీ తరపున తాడేపల్లిగూడెం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాల రావు.. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఆయన మంత్రిగా పదవి పొందడం విశేషం. 

కాగా తనకు కరోనా వచ్చిందని మాణిక్యాల రావు జూలై 4న స్వయంగా వెల్లడించారు. ఇటీవల పాజిటివ్‌గా నిర్థారణ అయిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీజేపీ నేతతో సహా కాంటాక్ట్ వున్న వాళ్లకి పరీక్షలు  నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందన్నారు. మాణిక్యాల రావు మరణంతో ఏపీ బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.