మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ తో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే మొదటివిడత నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్ప నేపథ్యంలో  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం 175నియోజకవర్గాల టిడిపి ఇన్ ఛార్జ్ లతో, మండల పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పంచాయితీ ఎన్నికల తొలిదశ నామినేషన్లకు ఈ రోజే చివరిరోజని గుర్తుచేశారు. అయితే ఇప్పటిదాకా కేవలం సగం స్థానాల్లోనే టిడిపి పార్టీ బలపర్చిన అభ్యర్థులు నామినేషన్లు వేశారని... మిగిలిన స్థానాల్లో కూడా ఈ రోజు నామినేషన్లు వేయాలని సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని సూచించారు.

''ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం పౌరులుగా మనందరి బాధ్యత. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉండాలి. తాడోపేడో తేల్చుకోడానికి సిద్దంగా ఉండాలి. బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్ధులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదు. వాలంటీర్ల ద్వారా ప్రలోభపెట్టాలని చూసే కుట్రలను తిప్పికొట్టాలి. వాటిపై ఎక్కడికక్కడ ప్రతిచోటా ఫిర్యాదులు చేయాలి'' అని సూచించారు.

read more  ఏపీ పంచాయితీ ఎన్నికలు... రికార్డు స్థాయిలో నామినేషన్లు నమోదు

''పంచాయితీ ఎన్నికలను ప్రతిఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలి. వైసిపి గుండాల చేతుల్లోకి మన గ్రామాలు వెళ్తే ప్రతి పల్లెకు కన్నీరే.. మీ ఊరి బాగు మీ చేతుల్లోనే.. గ్రామాల్లో ప్రశాంతతను కాపాడాలి..వైసిపి వాళ్లు గెలిస్తే ఊళ్లన్నీ వల్లకాడు చేస్తారు. సమర్ధులైన వాళ్లే సర్పంచులుగా ఎన్నికయ్యేలా చూడాలి. టిడిపి ద్వారానే నిజమైన గ్రామస్వరాజ్యం. గ్రామాభివృద్దికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే జన్మభూమి-మావూరు, స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు, గ్రామదర్శని, పచ్చదనం-పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం. ప్రతిపల్లెను సుందరంగా తీర్చిదిద్దాం, ప్రజారోగ్యాన్ని కాపాడాం'' అని పేర్కొన్నారు. 

''పొలం పిలుస్తోంది, నీరు-ప్రగతి, పంట సంజీవని, వనం-మనం, జల సంరక్షణ ఉద్యమాల ద్వారా రైతాంగం అభ్యున్నతికి కృషి చేశాం. వైసిపి వచ్చాక వాటన్నింటిని రద్దుచేసింది. టిడిపి పాలనలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలను కళావిహీనంగా చేసింది. కక్షా కార్పణ్యాలకు వేదికలుగా గ్రామాలను వైసిపి మార్చింది. హింసా విధ్వంసాలతో బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలపై దమనకాండకు పాల్పడుతోంది. చివరికి దేవాలయాలపై దాడులకు కూడా తెగబడ్డారు.  వీటన్నింటికీ గుణపాఠం చెప్పే అవకాశం ఈ ఎన్నికల రూపంలో వచ్చింది'' అన్నారు.

''నాయకత్వ సామర్ధ్యానికి పరీక్ష గ్రామ పంచాయితీ ఎన్నికలు. భవిష్యత్తులో నాయకులుగా ఎదిగే వేదికలు గ్రామ పంచాయితీలే. సర్పంచ్ గా ఎన్నికై, ఆ తరువాత అంచెలంచెలుగా అసెంబ్లీకి, పార్లమెంటు స్థాయికి ఎదిగిన నాయకులను అనేకమందిని చూశాం. ప్రతి గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామ పాలకుడు సర్పంచి.. గ్రామసభకు అధ్యక్షత వహించేది అతడే..గ్రామంలో చేపట్టే అభివృద్ది, సంక్షేమ పనుల పర్యవేక్షణ బాధ్యత గ్రామసభ, సర్పంచ్ లదే. ప్రధాని, ముఖ్యమంత్రి పాల్గొనే సభల్లో కూడా పెద్దపీట సర్పంచ్ లకే.. గ్రామంలో అత్యున్నత గౌరవం సర్పంచ్ కే..ఎంతో కీలకమైన సర్పంచ్ పదవిని వైసిపి రౌడీల పరం చేస్తే అధోగతే'' అని హెచ్చరించారు. 

''ప్రతి ఏటా నరేగా నిధులు రూ9,975కోట్లు, 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ2,625కోట్లు, స్టాంప్ డ్యూటీ నిధులు రూ350కోట్లు, మైనింగ్ సెస్ నిధులు రూ 300కోట్లు, ఇళ్లపన్ను, ఇతర పన్నుల రాబడి రూ750కోట్లు.. అన్నీ కలిపి ఏడాదికి మొత్తం రూ14వేల కోట్లు నిధులు, రాష్ట్రవ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయితీలు పొందే వీలుంది. ఈ లెక్కన చూస్తే ప్రతి గ్రామానికి ఏడాదికి రూ కోటి పైగా నిధులు వస్తాయి. ప్రతి సర్పంచి తన 5ఏళ్లలో రూ5కోట్ల పైగా నిధులతో అభివృద్ది పనులు ప్రతిఊళ్లో చేసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు వీటికి అదనం. చొరవ తీసుకుని మరిన్ని నిధులు మీ గ్రామాలకు రాబట్టుకోవచ్చు. ఇవి ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చే నిధులు కావు. గాంధీజి, అంబేద్కర్ తదితర పెద్దలిచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించే నిధులు. స్థానిక స్వపరిపాలన అనేది వీటిని అందుకే..'' అన్నారు.

''ఎవరి బెదిరింపులకు భయపడాల్సింది లేదు. ధైర్యంగా ముందుకొచ్చి నామినేషన్లు వేయండి. మీ గ్రామాలను వైసిపి గుండాల బారినుండి మీరే కాపాడుకోండి'' అంటూ టిడిపిశ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.