పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు హటాత్తుగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు కేవలం ఏలూరులోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆందోళనకు కారణమయ్యింది. అయితే ఇప్పటికీ నెల్లూరు ప్రజల అనారోగ్యానికి కారణం డాక్టర్లు సైతం ఇంకా గుర్తించలేదు. అయితే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు మాత్రం ఇందుకు కారణం కలుషిన నీరే అంటున్నారు. 

ఏలూరు ఘటనపై చంద్రబాబు సోషల్ మీడియా వేదికన ఈ విధంగా స్పందించారు.''సుర‌క్షిత‌మైన తాగునీరూ ఇవ్వ‌లేని జ‌గ‌న్‌రెడ్డి పాల‌న వ‌ల్ల 150 మందికి పైగా పిల్ల‌లు,పెద్ద‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌తో విల‌విల్లాడుతున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కేంద్రం, వైద్యారోగ్య‌శాఖా మంత్రి  సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఏలూరులో తాగునీరు క‌లుషితం అయిందంటే ఎంత బాధ్య‌తారాహిత్యమో అర్థం అవుతోంది. ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క‌లేనిత‌నం క‌నిపిస్తోంది. 18 నెల‌ల పాల‌న‌లో క‌నీసం ర‌క్షిత మంచినీటి ట్యాంకులూ శుభ్రం చేయించ‌ని నిర్ల‌క్ష్యం ఫ‌లిత‌మే ఈ విషాదం'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏలూరులో గత అర్థరాత్రి నుండి వందల సంఖ్యలో అస్వస్థతకు గురయి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏలూరులో 227 మంది అస్వస్థతకు గురయ్యారని... బాధితుల సంఖ్య పెరుగుతోందని మంత్రి తెలిపారు.

ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటివరకూ 70 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 76 మంది మహిళలు, 46 మంది చిన్నపిల్లలు మొత్తం 157 మంది ఆసుపత్రిలలో చికిత్స అందిస్తున్నామన్నారు మంత్రి నాని.