రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అస్వస్థత... కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణుల్లో ఆందోళన
గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన ఆయన గత నెలరోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే వున్నారు. గత నాలుగైదు రోజులుగా ఉక్కపోత పెరగడంలో ఆయన డీహైడ్రేషన్ కు గురయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని జైలు అధికారులు మాత్రం దృవీకరించలేదు.
మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబుతో ఆయన భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితో పాటు టిడిపి నేత పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. ఆయన యోగక్షేమాలు అడగ్గా డీహైడ్రేషన్ కు గురవుతున్నట్లు తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని జైలు అధికారులు, మెడికల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అస్వస్థతకు గురవడంతో ఆయన కుటుంబమే కాదు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. జైల్లో సరయిన సౌకర్యాలు కల్పించకపోవడమే చంద్రబాబు అస్వస్ధతకు కారణమని అంటున్నారు. వెంటనే తమ నాయకుడిని మెరుగైన వైద్యం అందించాలని టిడిపి శ్రేణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Read More చంద్రబాబు అరెస్ట్ : జగన్ వాడిన భాష.. దిగజారుడుతనానికి నిదర్శనం...
ఇప్పటికే చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో రక్షణ లేదని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జైల్లో తండ్రి భద్రతపై నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలుపై దాడి చేస్తామని కొందరు పోలీసులకు లేఖ పంపించారని... ఇంకొందరు జైలు పరిసరాల్లో డ్రోన్ ఎగురవేశారని పేర్కొన్నారు. ఇదే జైలులో కొందరు నక్సలైట్లు, గంజాయి విక్రయించేవారు ఖైదీలుగా వున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక అంతకుముందు ఓ దొంగతనం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న సత్యానారాయణ అనే వ్యక్తి డెంగ్యూతో మృతిచెందాడు. దోమలు కుట్టడంతో డెంగ్యూ బారినపడ్డ సత్యనారాయణ ప్లేట్ లెట్స్ పడిపోవడంతో మృతిచెందాడు. ఈ క్రమంలో ఇదే జైల్లో వున్న చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది.
సైకో జగన్ కక్షతోనే ప్రతిపక్ష నాయకున్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాడని... ఇప్పుడు ఏకంగా చంపేందుకే కుట్ర పన్నుతున్నాడన్న అనమానాలు రోజురోజుకు మరింత బలపడుతున్నాయని అన్నారు. జైల్లో పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతోందని లోకేష్ అన్నారు. న్యాయస్థానం చంద్రబాబుకు జైల్లో కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించిందని.. కానీ ప్రభుత్వం, జైలు అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. బయట జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో చంద్రబాబు ఉంటారు కాబట్టి ఏం చేయలేరు.. అందువల్లే జైల్లో హాని తలపెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. జైల్లో ఉన్న చంద్రబాబు విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెబుతున్నా జైలు అధకారులు పట్టించుకోవడం లేదని లోకేష్ అన్నారు. ఇప్పుడు దోమలు కుట్టడంతో డెంగ్యూ బారినపడి ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందడం చంద్రబాబు రక్షణపై మరిన్ని అనుమానాలు కలిగిస్తోందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు.