ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనేది చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ తమకు ఎవరితోనూ పొత్తులు స్పష్టం చేయగా.. విపక్ష పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతాయనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనేది చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఒంటరిగా బరిలో దిగుతాయా?.. మూడు పార్టీలు కలిసి కూటమిగా ముందుకు వెళ్తాయా?, టీడీపీ ఒంటరిగా వెళ్లి జనసేన-బీజేపీ కూటమిగా బరిలో నిలుస్తాయా?.. ఇలా పలు రకాల సమీకరణాలు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని అంటున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతుంది.
బీజేపీతో, జనసేనతో సత్సబంధాల కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. టీడీపీ వర్గాల నుంచి అదే రకమైన వైఖరి కనిపిస్తుంది. అయితే ఏపీ బీజేపీ నాయకత్వం మాత్రం తాము టీడీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది. తమ పొత్తు జనంతో, జనసేనతో మాత్రమేనని చెబుతుంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయకపోయినా.. వైసీపీని గద్దె దించేందుకు టీడీపీతో(జనసేనకు సముచిత గౌరవం ఉంటేనే) కలిసి ముందుకు సాగుతామనే సంకేతాలను ఇస్తున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో చోటుచేసుకున్న ఓ పరిణామం.. ఏపీలో పొత్తులపై చర్చను మరింత ఉధృతం చేసింది. అయితే ఈ రాజకీయ పరిణామం మాత్రం ఏపీలో చోటుచేసుకుంది కాదు. అండమాన్ నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్‌లో చోటుచేసుకుంది. గతేడాది జరిగిన పోర్టు బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో.. మొత్తం 24 స్థానాల్లో బీజేపీ 10, కాంగ్రెస్ 10, టీడీపీ 2, డీఎంకే 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానం గెలుచుకున్నారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందిన టీడీపీ కింగ్ మేకర్‌గా మారింది.
మున్సిపల్ కౌన్సిల్ పీఠాన్ని దక్కించుకునే విషయంలో బీజేపీ, టీడీపీలు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు పార్టీలు ఒకరికొకరు మద్దతుగా.. మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ పదివీకాలాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. తొలి సంవత్సరం బీజేపీ, రెండో సంవత్సరం టీడీపీ (ఒక అభ్యర్థి), మూడో సంవత్సరం టీడీపీ (మరో అభ్యర్థి, చివరి రెండు సంవత్సరాలు బీజేపీ చైర్‌పర్సన్ పదవిని చేపట్టాలని అవగాహనకు వచ్చారు. ఈ క్రమంలోనే తొలి సంవత్సరం పూర్తి కావడంతో.. మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ పదవికి ఎన్నిక జరిగింది. టీడీపీ అభ్యర్థి సెల్వి బీజేపీ మద్దతుతో చైరపర్సన్ పదవిని దక్కించుకున్నారు. మొత్తం 24 సభ్యులు ఉండగా.. ఆమెకు 14 ఓట్లు లభించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల వెలుపల.. టీడీపీ తొలిసారిగా ఓ కీలక పదవిని దక్కించుకున్నట్టుగా అయింది.
అయితే ఈ పరిణామాలపై అటు బీజేపీ, ఇటు టీడీపీ హర్షం వ్యక్తం చేశాయి. పోర్టు బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ-టీడీపీ కూటమి విజయం సాధించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ‘‘పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో ఈ అద్భుతమైన విజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు. పోర్ట్ బ్లెయిర్ ప్రజల కోసం మీ కృషి, అంకితభావం ఫలించాయి, ఈ విజయం ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం’’ అని నడ్డా పేర్కొన్నారు.
మరోవైపు పోర్టు బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా గెలుపొందిన టీడీపీకి చెందిన ఎస్ సెల్వికి చంద్రబాబు నాయుడు అభినందలు తెలిపారు. ఆమె నియామకం కూటమిపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఆమె ప్రజాసేవలో విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఏపీలో పొత్తు మాటేమిటి..?
గతంలో పలు ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి ముందుకు సాగాయి. మరికొన్ని సందర్బాల్లో వేర్వేరు దారులు చూసుకున్నాయి. ఏపీ పునర్విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి ముందుకు సాగాయి. ఈ కూటమికి జనసేన కూడా మద్దతు తెలిపింది. అయితే 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఆ సమయంలో బీజేపీపై టీడీపీ పలు విమర్శలు కూడా చేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పాటు, పలు విపక్ష పార్టీలకు దగ్గరయ్యారు.
అయితే 2019లో ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు.. కొంతకాలం నుంచి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పోర్టు బ్లెయిర్‌లో బీజేపీ-టీడీపీ కూటమి కలిసి ముందుకు సాగడంతో.. ఏపీ, తెలంగాణలలో కూడా ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయా? అనేది చూడాల్సి ఉంది. అయితే జేపీ నడ్డా తన ట్వీట్‌లో.. బీజేపీ-టీడీపీ కూటమి అని ప్రస్తావించడంతో ఇది పొత్తుకు సానుకూల సంకేతమనే కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం రెండు పార్టీలు పోర్టు బ్లెయిర్‌లో పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాయని.. అలాంటి పరిస్థితి ఏపీలో లేదని అంటున్నారు. మరి ఏ వాదన నిజమవుతుంది..? బీజేపీ-టీడీపీలు తిరిగి కూటమిగా ముందుకు సాగుతాయా? లేదా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
