తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి బుధవారంనాడు నామినేషన్ వేశారు. నేతలు, కార్యకర్తలతో కలిసి  నెల్లూరు వీఆర్సీ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు.  జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే సొంత ప్రయోజనాల కోసం ఏపీని కేంద్రానికి తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. 

 అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టులు చేయిస్తోందని విమర్శించారు. అప్పటికీ లొంగకపోతే వ్యాపారాలను దెబ్బతీయడం, ఎవరైనా టీడీపీకీ సానుభూతిపరులుగా ఉండి.. వ్యాపారాలు చేసుకుంటే వాటిని ధ్వంసం చేయడంలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు.