అమరావతి: జిల్లా పరిషత్ ఎన్నికల ఎన్నికల విషయంలో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించినా దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.కుప్పం సహా కొన్ని చోట్ల ఈ నిర్ణయం కొందరికి నచ్చకపోవచ్చన్నారు. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని అందరూ పాటించాలని  ఆయన కోరారు. 

వైసీపీ గతంలో పలుమార్లు ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.  ఈ నెల 2వ తేదీన  టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలువురి నేతల అభిప్రాయాలను తీసుకొన్న చంద్రబాబునాయుడు పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కొందరు ఈ నిర్ణయాన్ని  వ్యతిరేకించారు.