బీజేపీ తేల్చాకే: సీట్ల సర్ధుబాటుపై టీడీపీ, జనసేన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటుపై సంక్రాంతి నాటికి ఈ రెండు పార్టీలు ప్రకటించనున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కసరత్తు దాదాపుగా పూర్తైంది. సంక్రాంతికి ఈ రెండు పార్టీలు ఏయే స్థానాల్లో పోటీ చేయనున్నాయో ప్రకటించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రకటించారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయి.
also read:జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
సంక్రాంతికి ఈ రెండు పార్టీలు పోటీ చేసే సీట్లను ప్రకటించనున్నాయి. అయితే బీజేపీ ఈ కూటమిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. బీజేపీ ఈ కూటమిలో చేరాలనే ఆకాంక్షను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీతో పొత్తు విషయాన్ని సంక్రాంతి నాటికి భారతీయ జనతా పార్టీ తేల్చే అవకాశం ఉంది. బీజేపీ వైఖరి తేలిన తర్వాతే తెలుగు దేశం , జనసేనలు తమ వైఖరిని ప్రకటించనున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సీట్ల సర్ధుబాటుతో పాటు ఉమ్మడి బహిరంగ సభల ఏర్పాటు విషయమై చర్చించారు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని విజయ నగరం జిల్లాలోని పోలిపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ కూడ పాల్గొన్నారు. విజయవాడ, తిరుపతిలలో కూడ ఈ రెండు పార్టీలు ఉమ్మడి సభలను నిర్వహించనున్నాయి. ఈ ఉమ్మడి సభల్లో మేనిఫెస్టోను కూడ విడుదల చేయనున్నారు.
also read:టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి నివేదిక
టీడీపీతో పొత్తు విషయమై బీజేపీ నేతల అభిప్రాయాలను ఆ పార్టీ జాతీయ నాయకత్వం సేకరించింది. ఈ విషయమై రాష్ట్ర కమిటీ పంపిన నివేదిక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వద్దకు చేరింది. మరో వైపు పొత్తుల విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తేల్చి చెప్పారు. జనసేన, తమ మధ్య పొత్తు ఉందనే విషయాన్ని పురంధేశ్వరి గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు విషయం మాత్రం ఆ పార్టీ ఇంకా తేల్చలేదు. సంక్రాంతి నాటికి ఈ విషయమై కమల దళం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.