Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కంటతడి.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు, పలువురు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (ap assembly sessions) సమావేశాల్లో టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ నేతల తీరును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనలకు దిగారు. 

tdp activists protest against ysrcp over chandrababu crying
Author
Amaravathi, First Published Nov 19, 2021, 10:31 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (ap assembly sessions) సమావేశాల్లో టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ నేతల తీరును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనలకు దిగారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో నిరసనలు జరిగాయి. విజయనగరంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు (ashok gajapathi raju) ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు.

వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) క్షమాపణలు చెప్పాలంటూ గుంటూరులోని ఆయన ఇంటి ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి నల్లపాడు, పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సీఎం జగన్‌, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయి. చిలకలూరిపేట టీడీపీ కార్యాలయం నుంచి ఎంఆర్టీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Also Read:Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం

మరోవైపు అనంతపురం జిల్లాలో ఇద్దరు కార్యకర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందని .. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. పురుగుల మందు తాగిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోనూ తెలుగుదేశం అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేశాడు.  చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం తట్టుకోలేక ఈ పని చేస్తున్నట్టు చెప్పాడు. వెంటనే స్పందించిన తోటి కార్యకర్తలు అతనిని ఆసుపత్రికి తరలించారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబు (Chandrababu Naidu)  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.  తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios